Guns Into Classrooms: స్కూల్ లోకి టీచర్లు తుపాకులు తీసుకెళ్లొచ్చట.. బిల్ పాస్ చేసిన అమెరికాలోని టెన్నెస్సీ హౌస్

Tennessee House Passes Bill Allowing Teachers To Carry Guns
  • స్కూల్ లో ఇటీవల కాల్పుల ఘటనలు పెరుగుతుండడంతో నిర్ణయం
  • భద్రత కోసమే అనుమతిస్తున్నట్లు సభ వివరణ
  • వివాదాస్పద బిల్లుపై సభలోనే నిరసనలు తెలిపిన సందర్శకులు
స్కూలు ఆవరణలోకి టీచర్లు తుపాకులు తీసుకెళ్లేలా అనుమతించే బిల్లుకు అమెరికాలోని టెన్నెస్సీ స్టేట్ హౌస్ ఆమోదం తెలిపింది. ఈ వివాదాస్పద బిల్లుపై ఏకంగా సభలోనే నిరసనలు వ్యక్తమయ్యాయి. బిల్లుపై చర్చ జరుగుతుండడంతో పలువురు టీచర్లు, స్టూడెంట్లు సందర్శకులుగా సభకు హాజరయ్యారు. బిల్లును పాస్ చేస్తూ సభలో స్పీకర్ తీర్మానం చదువుతుండగానే సందర్శకుల గ్యాలరీ నుంచి జనం పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్’ అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో స్పీకర్ స్పందిస్తూ.. సందర్శకుల గ్యాలరీ ఖాళీ చేయించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.

అమెరికాలో తుపాకీ సంస్కృతి పెరిగిపోతోందని ఓవైపు ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. ఇప్పుడు ఏకంగా స్కూల్ లోకి తుపాకులు తీసుకెళ్లేందుకు టీచర్లకు అనుమతిస్తూ బిల్లు పాస్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థల ఆవరణలోకి పోలీసులు కూడా ఆయుధాలతో ప్రవేశించకూడదని చట్టాలు చెబుతుండగా ఏకంగా టీచర్ల చేతికే తుపాకులు ఎలా ఇస్తారంటూ అక్కడి రాజ్యాంగ నిపుణులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. రిపబ్లికన్ల నిర్ణయంపై డెమోక్రాట్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అధికార రిపబ్లికన్ నేతలు మాత్రం ఈ వివాదాస్పద బిల్లును సమర్థించుకుంటున్నారు. స్కూలులో కాల్పుల ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయని గుర్తుచేశారు. విద్యాసంస్థల ఆవరణలలో పోలీసుల ప్రవేశం, ఆయుధాల వాడకంపై పరిమితుల నేపథ్యంలో భద్రతాపరమైన లొసుగులను సరిచేసేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని చెప్పారు. కొద్దిమంది టీచర్లకు అదికూడా సరైన శిక్షణ ఇచ్చాకే తుపాకీ తీసుకెళ్లేందుకు అనుమతించేలా బిల్లులో ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సంతకం చేయగానే చట్టంగా మారుతుందని వివరించారు.
Guns Into Classrooms
USA
Tennessee
Tennessee House
Bill Passed
Teachers Carry Guns

More Telugu News