Madhavi Latha: మాధవీలత వచ్చాక ఒవైసీ కనిపించకుండా పోయారు... హైదరాబాద్లో కమలం వికసిస్తుంది: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
- పాతబస్తీలో 40 ఏళ్ల జంగిల్ రాజ్ నుంచి విముక్తం చేయడానికి మాధవీలత వచ్చిందన్న అనురాగ్
- మోదీ ప్రభుత్వం సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు సాగుతోందని వెల్లడి
- రాహుల్ గాంధీ, ఒవైసీలు ఔరంగజేబు స్కూల్ నుంచి వచ్చారని ఎద్దేవా
హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున మాధవీలత బరిలోకి దిగినప్పటి నుంచి మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనిపించకుండా పోయారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్ లోక్ సభ పరిధిలో పార్టీ అభ్యర్థి మాధవీలత తరఫున ఆయన రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్లోని ప్రతి గల్లీ మాధవీలత గెలుపు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తోందన్నారు. పాతబస్తీలో 40 ఏళ్ల జంగిల్ రాజ్ నుంచి తమను విముక్తం చేయడానికి మాధవీలత, కమలం వచ్చాయని భావిస్తున్నారన్నారు. హైదరాబాద్లో కమలం వికసిస్తుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా బలంగా ఉండాలని పేర్కొన్నారు. గత పదేళ్ల మోదీ హయాంలో మన దేశం శక్తిమంతమైందని... మరింత సుసంపన్నంగా మారిందన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ దేశాన్ని నిర్వీర్యం చేసేవిధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేసిందని ఆరోపించారు.
కానీ మోదీ ప్రభుత్వం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేశామన్నారు. ప్రజలు కష్టించి సంపాదించుకున్న సొత్తులో 55 శాతం డబ్బును వారి మరణానంతరం ప్రభుత్వం తీసుకోవాలని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అన్నారని... అలా జరగాలని అందరూ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మీ డబ్బును లాక్కొని చొరబాటుదారులకు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు.
ఇండియా కూటమి భారత్తో ఉందా? లేక మనదేశ శత్రువుల వైపు ఉందా? అని అనురాగ్ ఠాకూర్ నిలదీశారు. దేశంలో అనేక ప్రదేశాలను కాంగ్రెస్ ఇతర దేశాలకు ఇచ్చిందని ఆరోపించారు. దేశంలో అత్యాధునిక ఆయుధాలను మనం సిద్ధం చేసుకుంటున్నామన్నారు. రాహుల్ గాంధీ, ఒవైసీలు ఔరంగజేబు స్కూల్ నుంచి వచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఎక్కడా ఒవైసీ ప్రభావం ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఒవైసీ అజెండాను అమలు చేసేలా రాహుల్ తీరు ఉందన్నారు. మహిళల రక్షణ, స్వతంత్రత కోసమే తాము పని చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబానికి తప్ప ఎవరికీ గుర్తింపు ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మొహం చాటేసిందన్నారు.