Israel-Gaza War: నిరసన ఎందుకో తెలియదన్న న్యూయార్క్ యూనివర్సిటీ విద్యార్థిని.. ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలలో ట్విస్ట్!
- న్యూయార్క్ యూనివర్సిటీలో పాలస్తీనాకు మద్దతుగా నిరసన
- నిరసన ఎందుకన్న ప్రశ్నకు తనకు తెలియదని విద్యార్థిని సమాధానం
- మరో విద్యార్థిని కూడా తెల్లమొహం వేసిన వైనం
- వీడియోను షేర్ చేసిన న్యూయార్క్ మేయర్
ఇజ్రాయెల్-గాజా మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడడం లేదు. దీనిని నిరసిస్తూ అమెరికాలోని పలు యూనివర్సిటీలకు చెందిన పాలిస్తీనా అనుకూల విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఇలా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిని న్యూయార్క్ సిటీ మేయర్ రుడీ గియులియానీ షేర్ ఎక్స్‌లో షేర్ చేశారు.
న్యూయార్క్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు సంబంధించిన వీడియో అది. అందులో ఇద్దరు విద్యార్థులు పాలస్తీనా అనుకూల నినాదాలు చేస్తున్నారు. అయితే, ఇద్దరు విద్యార్థులకు మాత్రం తామెందుకు నిరసన చేస్తున్నదీ తెలియకపోవడం గమనార్హం. ఆందోళన ఎందుకన్న ప్రశ్నకు ఓ విద్యార్థిని చెప్పిన సమాధానం అందరినీ నివ్వెరపరుస్తోంది. నిజాయతీగా చెప్పాలంటే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎందుకు నిరసన తెలుపుతున్నదీ తనకు తెలియదని చెప్పుకొచ్చింది.
‘‘పాలస్తానాకు వ్యతిరేకంగా మద్దతు తెలపడమే మా లక్ష్యం. నిజాయతీగా చెప్పాలంటే న్యూయార్క్ యూనివర్సిటీ ఇది ఎందుకు చేస్తుందో నాకు తెలియదు’’ అని చెప్పింది. ఆ వెంటనే తన పక్కనే ఉన్న మరో విద్యార్థిని ‘నీకేమైనా తెలుసా?’ అని ప్రశ్నించింది. దానికి ఆమె బదులిస్తూ.. ‘నేను మరింత తెలుసుకోవాల్సింది’ అని పేర్కొంది. ఈ నిరసనకు మద్దతు కోసం తాను కొలంబియా యూనివర్సిటీ నుంచి వచ్చానని మొదటి విద్యార్థిని తెలిపింది.