Shubman Gill: ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే జట్టుకు అదనపు బలం: శుభ్‌మన్ గిల్
- జట్టుకు అధిక స్కోరును అందించడంలో ఇంపాక్ట్ ప్లేయర్ ముఖ్య పాత్ర పోషిస్తాడన్న గిల్
- వికెట్లు పడిపోతున్నా అతడు ఉన్నాడనే నమ్మకం మిగిలిన వాళ్లలో ధైర్యాన్ని నింపుతుందని వ్యాఖ్య
- అదే వారిని మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడేలా చేస్తుందన్న గుజరాత్ కెప్టెన్
- ఢిల్లీతో ఉత్కంఠభరితమైన పోరులో ఛేదనలో విఫలమై 4 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ల గురించి సంచలన న్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే జట్టుకు అదనపు బలం సమకూరినట్టేనని అన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో చేదనలో విఫలమై కేవలం 4 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. గిల్ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఇలా స్పందించాడు.
"జట్టుకు అధిక స్కోరును అందించడంలో ఇంపాక్ట్ ప్లేయర్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. వికెట్లు పడిపోతున్నా అతడు ఉన్నాడనే నమ్మకం మిగిలిన వాళ్లలో ధైర్యాన్ని నింపుతుంది. అదే వారిని మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడేలా చేస్తుంది. ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో మేము 200 - 210 పరుగుల మధ్యనే కట్టడి చేస్తామని అనుకున్నాం. చివరి 2 ఓవర్లలో కొన్ని అదనపు పరుగులు కూడా చేశాం. ఛేజింగ్ గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లక్ష్యాన్ని మనం ఛేదించగలమా? లేదా? అని ముందుగా తెలుసుకోవాలి. అందుకు తగ్గ ప్రణాళిక రూపొందించుకోవడం కూడా అంతే ముఖ్యం. బౌలర్లకు గ్రౌండ్ అనుకూలించకపోతే యార్కర్లు వేసేందుకు ప్లాన్ చేసుకోవాలి. మేం బాగానే ఆడామని అనుకుంటున్నాం. చివరిలో అసంతృప్తికి గురి కావాల్సి వచ్చింది. గేమ్ ఆసాంతం గెలుస్తామనే ధీమాతోనే ఉన్నాం" అని గిల్ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విన్నింగ్ కెప్టెన్ రిషభ్ పంత్ 43 బంతుల్లో 88 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని సూపర్ నాక్ కారణంగా డీసీ ఏకంగా 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. కారు ప్రమాదంలో గాయపడిన కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్‌కు దూరమైన తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి ఇటు వికెట్ కీపర్‌గా అటు బ్యాటర్‌గా రాణిస్తుండడం విశేషం.
"మైదానంలో ప్రతి గంట ముఖ్యమైంది. నేను మైదానంలో ఉండటాన్ని ఇష్టపడతాను. వందకు వంద శాతం మ్యాచ్‌లో ఎఫెర్ట్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు కొంత సమయం పడుతుంది. ఇక మ్యాచ్‌లో తొలి సిక్స్ అనేది నాకు ఆటపై ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఎక్కువ సమయం క్రీజులో గడపడాన్ని ఆస్వాదిస్తాను" అని పంత్ అన్నాడు.
ఇదిలాఉంటే.. ఇంపాక్ట్ ప్లేయర్‌పై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా నాణ్యమైన ఆల్‌రౌండర్లు తమ ఉనికిని కోల్పోతున్నారని హిట్‌మ్యాన్ తెలిపాడు. వారిని బ్యాటింగ్‌కే పరిమితం చేయడం ద్వారా బౌలింగ్‌లో వెనుకబడిపోతున్నారని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారత జట్టుకూ మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. అందుకే తాను ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు వ్యతిరేకమని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.