Kompella Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
- ఒవైసీపై పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలత
- కుటుంబ స్థిర, చర ఆస్తులు రూ. 221.37 కోట్లు
- అప్పులు రూ. 27.03 కోట్లు
లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కొంపెల్ల మాధవీలత బరిలోకి దిగారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. తన ఎన్నికల అఫిడవిట్ లో ఆమె భారీ మొత్తంలో ఆస్తులను ప్రకటించారు. తన కుటుంబ చర, స్థిర ఆస్తుల విలువ రూ. 221.37 కోట్లు అని ఆమె తెలిపారు. ఇందులో చరాస్తుల విలువ రూ. 165.46 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లుగా ఉంది. రూ. 27.03 కోట్ల అప్పులు ఉన్నట్టు ఆమె ప్రకటించారు.
వినో బయోటెక్, విరించి లిమిటెడ్ లో తన పేరిట రూ. 8.92 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట రూ. 56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని ఆమె తెలిపారు. అన్ లిస్టెడ్ కంపెనీలైన విరా సిస్టమ్స్, పీకేఐ సొల్యూషన్స్, గజ్వేల్ డెవలపర్స్ లో తన పేరిట రూ. 16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట రూ. 29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉందని చెప్పారు. వ్యవసాయ భూములు, వాహనాలు లేవని చెప్పారు. తనపై ఒక క్రిమినల్ కేసు ఉందని తెలిపారు. పొలిటికల్ సైన్స్ లో తాను మాస్టర్స్ డిగ్రీ చేశానని తెలిపారు.