Fire Accident: పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం..ఆరుగురి మృతి
- మరో 30 మందికి పైగా గాయాలు
- గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చిన పోలీసులు
- క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న సీఎం నితీష్ కుమార్
బిహార్ రాజధాని పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా...30 మంది వరకు గాయపడ్డారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ లో ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగాయి. మంటల్ని అదుపు చేసే క్రమంలో అగ్ని కీలలు హోటల్ మొత్తం వ్యాపించాయి. మంటలు చెలరేగడాన్ని చూసిన హోటల్ లోని చాలామంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకోగా మరికొందరు హోటల్ మంటల్లోనే చిక్కుకుపోయారు. దీంతో బయటకు వచ్చే దారిలేక పోవడంతో ఆరుగురు సజీవదహనమైపోయారు. 30 మంది వరకు గాయపడ్డారు.
అగ్ని ప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే సిబ్బందితో అక్కడకు చేరుకుని సుమారు రెండుగంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారిస్తున్నారు. కాగా, అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.