Komatireddy Raj Gopal Reddy: బీఆర్ఎస్ వాళ్ల టైమ్ బాగాలేక నేను హోంమంత్రిని అయితే అందర్నీ జైల్లో వేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- దేవుడా దేవుడా.. రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి కావొద్దని బీఆర్ఎస్ వాళ్లు కోరుకుంటున్నారన్న కోమటిరెడ్డి
- నేనేం కావాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందన్న మునుగోడు ఎమ్మెల్యే
- లక్షల కోట్లు దోచుకున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపు
- పంచపాండవుల్లా ఐదుగురం ఉన్నాం... పేదలకు అండగా ఉంటామని వ్యాఖ్య
'నేను హోం మంత్రిని అయితే బీఆర్ఎస్ వాళ్లంతా జైలుకు పోతారు. రోజూ బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారంట... దేవుడా దేవుడా... రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి కావొద్దు అని కోరుకుంటున్నారట... ఒకవేళ వారి టైమ్ బాగాలేక నేను హోంమంత్రిని అయితే బీఆర్ఎస్ వాళ్లు ఒక్కరు కూడా బయట ఉండరు... ఒక్కొక్కరిని చూసి బొక్కలో వేస్తా... నేను ఏం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. కానీ మనం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సి ఉంది' అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
గురువారం ఆయన తుంగతుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారాన్ని అడ్డుపెట్టుకొని... తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్లు దోచుకొని... రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వారి అవినీతిని బయటకు తీసి జైలుకు పంపించాలని... తిన్న సొమ్మును కక్కించాలన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. వారి వద్ద నుండి డబ్బులను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భువనగిరి లోక్ సభ స్థానం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మందుల శామ్యూల్, నేను, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి... ఇలా పంచపాండవుల్లా ఐదుగురం ఉన్నామని... మీకు అండగా ఉంటామన్నారు. పేదలకు, రైతులకు అండగా ఉంటామన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చామల కిరణ్కు ఓటేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తున్నట్లే అన్నారు. తాను తన భార్యకు టిక్కెట్ అడగలేదని... పార్టీ అధిష్ఠానం ఎవరికి టిక్కెట్ ఇస్తే వారి గెలుపుకు కృషి చేస్తానని ముందే చెప్పానన్నారు.