Saudi Arabia: మిస్ యూనివర్స్ పోటీలో ఈ ఏడాది సౌదీ అరేబియా మోడల్ కు చోటు!

Saudi Arabia Could Get Its First Ever Miss Universe Contestant This Year

  • సౌదీ మోడల్ ఎంపికను పరిశీలిస్తున్నామన్న మిస్ యూనివర్స్ సంస్థ
  • ఈ ఏడాది సెప్టెంబర్ లో మెక్సికోలో జరగనున్న అందాల పోటీలు
  • తాను ఈ పోటీకి ఎంపికైనట్లు గతంలోనే ప్రకటించిన రుమీ అల్–ఖహ్ తానీ



ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా నుంచి మిస్ యూనివర్స్ అందాల పోటీకి ఈ ఏడాది ఓ మోడల్ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. సౌదీ నుంచి పోటీ చేయదగ్గ అర్హతగల మోడల్ ను ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మిస్ యూనివర్స్ సంస్థ సమన్వయకర్త మారియా హోస్ ఉండా ఓ ప్రకటనలో ఏఎఫ్ పీ వార్తాసంస్థకు తెలిపారు. మెక్సికోలో సెప్టెంబర్ లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు సౌదీ నుంచి పోటీదారు ఉండే అవకాశం ఉందన్నారు. 

ఈ పోటీకి తాను ఎంపికైనట్లు రియాద్ కు చెందిన 27 ఏళ్ల ఫ్యాషన్ మోడల్, ఇన్ ఫ్లుయెన్సర్ రుమీ అల్–ఖహ్ తానీ మార్చిలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. సౌదీ జెండా పట్టుకొని ఉన్న ఫొటోను ఆమె నెటిజన్లతో అప్పట్లో పంచుకుంది. సౌదీ తరఫున ఈ పోటీలో ప్రాతినిధ్యం వహించనుండటాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు రుమీ పేర్కొంది. 

అయితే ఆమె ప్రకటనను అసత్యంగా, తప్పుదోవ పట్టించేదిగా మిస్ యూనివర్స్ సంస్థ అభివర్ణించింది. సౌదీ నుంచి మిస్ యూనివర్స్ అందాల పోటీకి ఇప్పటివరకు తాము ఎవరినీ ఎంపిక చేయలేదని స్పష్టం చేసింది. కానీ రుమీ ఈ పోటీలో పాల్గొనాలంటే ఇతరుల తరహాలోనే అదే ఎంపిక ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పోటీలో పాల్గొనాలనుకుంటున్న రుమీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది.

మరోవైపు ఈ అంశంపై రుమీ అల్–ఖహ్ తానీ స్పందించింది. తాను గతంలో మిడిల్ ఈస్ట్, యూరోప్ లో జరిగిన పలు అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఏఎఫ్ పీ వార్తాసంస్థకు తెలిపింది. జాతీయ జెండా పట్టుకొని ఆధునిక దుస్తుల్లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సంప్రదాయవాదులు తప్పుబట్టడం గురించి ప్రశ్నించగా ఆమె తనదైన శైలిలో బదులిచ్చింది. తనపై విమర్శలను పట్టించుకోనని చెప్పింది. ఎందరో క్రీడాకారులు కూడా తనలాగే జెండా చేతిలో పట్టుకొని ఫొటోలు దిగుతుంటారని గుర్తుచేసింది. అందువల్ల తాను ఎలాంటి తప్పు చేయలేదని రుమీ వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పుడు తనను ఎందరో యువతులు సంప్రదిస్తున్నారని.. తాను ఈ స్థాయికి చేరుకోవడంతో వారు కూడా ఇలాంటి పోటీలలో పాల్గొనాలని అనుకుంటున్నారని చెప్పింది.

రుమీ తల్లి ఫాజియా అయద్ సైతం కుమార్తెను సమర్థించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా తన కుమార్తె అందాల పోటీలో పాల్గొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పింది. గతంలో సౌదీ సమాజం చాలా కఠినంగా ఉండేదని పేర్కొంది. ఇప్పుడు పరిస్థితులు మారినందున కుమార్తెను ఆమె రంగంలో ముందుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నట్లు వివరించింది.

సౌదీ అరేబియా పేరు చెప్పగానే ఆంక్షల పేరుతో సాగే మహిళా అణచివేత గుర్తొస్తుంది. అయితే దేశంలోకి పెట్టుబడులను, పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా ఈ కఠిన నిబంధనల ఇమేజ్ ను కాస్త సడలించేందుకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళల కారు డ్రైవింగ్ పై ఉన్న ఆంక్షలను ఎత్తేశారు.

  • Loading...

More Telugu News