Narendra Modi: గతంలో నేను బెంగాల్ లో పుట్టి ఉంటాను: ప్రధాని నరేంద్ర మోదీ

Narendra Modi says his rebirth is going to be in Bengal
  • పశ్చిమబెంగాల్ లోని మాల్దా జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ
  • కాంగ్రెస్, టీఎంసీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న మోదీ
  • అభివృద్ధి రూపంలో బెంగాల్ ప్రజల ప్రేమను తిరిగి ఇస్తానన్న ప్రధాని
 గత జన్మలో తాను పశ్చిమ బెంగాల్ లో పుట్టి ఉంటానేమోనని, అందుకే మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలకు సదా పాత్రుడనని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం పశ్చిమబెంగాల్ లోని మాల్దా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ....కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని, అందుకే ఆ రెండు పార్టీలు జతకట్టాయని విమర్శించారు. ఇక్కడికి మీరంతా భారీగా తరలిరావడంతో ఈ ప్రదేశం చిన్నదైపోయిందని, మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించాలని బహిరంగ సభకు వచ్చిన ప్రజలనుద్దేశించి కోరారు. మీ ప్రేమను అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తానని హామీనిచ్చారు. ‘‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే గత జన్మలో నేనిక్కడ పుట్టానేమోనని లేదా వచ్చే జన్మలో ఇక్కడైనా పుడతానేమోనని అనిపిస్తోంది’’ అని మోదీ అన్నారు. 

 ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా హైకోర్టు 26 వేల ఉద్యోగాలను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు టీఎంసీ అవినీతి రాజకీయాలకు పరాకాష్ఠ అని మోదీ అన్నారు. కుంభకోణాలకు టీఎంసీ పర్యాయపదంగా మారిందన్నారు. ఆ పార్టీ కుంభకోణాల్లో మునిగితేలుతుంటే బెంగాల్ లోని యువత ఉద్యోగాల్లేక రోడ్లమీద తిరుగుతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంసీ పార్టీ బెంగాల్ యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని విమర్శించారు. 
Narendra Modi
West Bengal
Trinamool Congress
BJP
Election campaign

More Telugu News