Buggana Nomination: బుగ్గన నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచడంపై ఈసీకి ఫిర్యాదు చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
- ఈ నెల 22న నామినేషన్ వేసిన మంత్రి బుగ్గన
- ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదంటూ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అభ్యంతరం
- బుగ్గన నామినేషన్ పెండింగ్ లో ఉంచిన రిటర్నింగ్ అధికారి
- బుగ్గన నామినేషన్ పై అధికారులు ఆలస్యం చేస్తున్నారంటూ కోట్ల అసంతృప్తి
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదంటూ డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అభ్యంతరం నేపథ్యంలో, బుగ్గన నామినేషన్ ను డోన్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పెండింగ్ లో ఉంచారు. సాయంత్రంలోపు ఆస్తుల వివరాలు సమర్పించాలని బుగ్గన న్యాయవాదిని ఆర్వో కోరారు.
అయితే, దీనిపై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ ఉన్నప్పుడు పెండింగ్ లో ఉంచాల్సిన అవసరం ఏంటని, ఆర్వో దానిపై నిర్ణయం తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్వో తీరును తప్పుబట్టిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. బుగ్గన నామినేషన్ పై నిర్ణయం తీసుకోకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. బుగ్గన నామినేషన్ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని కోరారు.