Pawan Kalyan: రాజోలు ఎమ్మెల్యే రాపాకపై పవన్ కల్యాణ్ ఫైర్
- రాజోలు నియోజకవర్గంలో వారాహి సభ
- సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై విమర్శలు
- అవినీతిపరుడు అంటూ ఆరోపణ
రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, ఎమ్మెల్యే రాపాక అవినీతి అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పేదలకు సెంటు ఇళ్ల పట్టాల విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, అందులో రాపాకకు కూడా చిన్నపాటి వాటా ఉందని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టలేని ఈ ఎమ్మెల్యే మలికిపురం మండలం కత్తిమండలంలో ఐదు ఎకరాల్లో భవనం కట్టుకున్నాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. మన ఓట్లపై గెలిచి ప్రజలకు ద్రోహం చేశాడని మండిపడ్డారు.
ఇసుకను బెదిరించి తీసుకున్నారని, ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్నారని ఆరోపించారు. ప్రైవేటు స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి రాజోలు ఎమ్మెల్యే అంటూ పవన్ ధ్వజమెత్తారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఇప్పటివరకు దానిపై ఒక్క కూడా మాట్లాడలేదని అన్నారు.
సఖినేటిపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలని 2019లో అడిగిన రాపాక, జగన్ పంచన చేరేసరికి ఆ విషయం మర్చిపోయారు అంటూ విమర్శించారు. మలికిపురంలో దాతలు ఇచ్చిన భూములతో ఓ కాలేజీ ఉందని, దానిపై అధికార వైసీపీ నేతల కన్ను పడిందని అన్నారు. ఆ భూముల విలువ రూ.500 కోట్లు అని, అందుకే ఒక్కొక్క లెక్చరర్ ను బదిలీ చేసి బలవంతంగా పంపించేసి భూములను దోచేసే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నా... మరో 18 రోజుల తర్వాత మేం గెలుస్తున్నాం... ఒక్కొక్క అవినీతిపరుడ్ని మేం బయటికి లాక్కొచ్చి జరిమానా కట్టేలా చేస్తాం అని హెచ్చరించారు.