KKR: ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డుకు దగ్గరగా వచ్చిన కోల్ కతా నైట్ రైడర్స్
- ఐపీఎల్ లో ఇవాళ కేకేఆర్ × పంజాబ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసిన కోల్ కతా
- పంజాబ్ బౌలింగ్ ను చీల్చిచెండాడిన కోల్ కతా బ్యాట్స్ మెన్
ఐపీఎల్ తాజా సీజన్ లో పరుగులు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ సీజన్-17లో బ్యాట్స్ మన్లదే హవా నడుస్తోంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టింది.
ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కూడా పరుగుల సునామీ సృష్టించింది. సన్ రైజర్స్ రికార్డు స్కోరు (287)కు కోల్ కతా చేరువగా వచ్చింది. ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ తొలి వికెట్ కు 138 పరుగులు జోడించి తిరుగులేని పునాది వేశారు. సాల్ట్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్ లతో 75 పరుగులు చేయగా... నరైన్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ లతో 71 పరుగులు చేశాడు.
ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ 39, ఆండ్రీ రసెల్ 24, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, కెప్టెన్ శామ్ కరన్ 1, హర్షల్ పటేల్ 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు.