Delhi High court: జైలులో ఉండి ఇంకా సీఎంగా కొనసాగుతున్న కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- జాతి ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపాటు
- అధికారంపై మాత్రమే ఆసక్తి ఉందంటూ విమర్శించిన ఢిల్లీ హైకోర్ట్
- ఢిల్లీలోని స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా చేరకపోవడంపై ఆగ్రహం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్నప్పటికీ సీఎం పదవికి ఇంకా రాజీనామా చేయని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని కోర్టు మండిపడింది. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి అధికారంపై మాత్రమే ఆసక్తి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా అందుబాటులోకి రాకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేవనే విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ... ‘‘మీ క్లయింట్‌కి కేవలం అధికారంపై మాత్రమే ఆసక్తి ఉంది. మీకు ఎంత అధికారం కావాలో నాకు తెలియదు’’ అని జడ్జి వ్యాఖ్యానించారు.
పుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా పంపిణీ చేయకపోవడానికి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడమే కారణమని ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమతి అవసరం ఉంటుందని, ఈ మేరకు ఆయనతో చర్చలు జరుపుతున్నామని, మరికొంత సమయం పడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. రూ.5 కోట్లకు మించిన కాంట్రాక్టులకు అనుమతించే అధికారం స్టాండింగ్ కమిటీలకు మాత్రమే ఉంటుందని వివరించారు. అందుకే నోట్‌బుక్స్, స్టేషనరీ వస్తువులు, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ చేయలేదని వినిపించారు. కేజ్రీవాల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి సౌరభ్ భరద్వాజ్ సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ వాదనపై కోర్టు మండిపడింది.
‘‘ముఖ్యమంత్రి జైలులో ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనసాగుతోందని చెప్పడం మీ ఇష్టం. మాకు ఇష్టం లేని దారిలో వెళ్లాల్సిందిగా మమల్ని మీరు బలవంతం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల మంత్రి సౌరభ్ భరద్వాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా లెఫ్టినెంట్ గవర్నర్ చట్టవిరుద్ధంగా కో ఆప్టెడ్ మెంబర్లను నియమించిన కారణంగా స్టాండింగ్ కమిటీ రద్దయిందని, ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది గుర్తుచేశారు. అయితే పుస్తకాలు పంపిణీ చేయడం కోర్టు పని కాదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవరో తమ విధుల్లో విఫలమయ్యారు కాబట్టి కలగజేసుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గత నెలలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.