Cell Phone Theft: అడ్రస్ అడుగుతూ ఫోన్లు కొట్టేసి.. రూ. 1.75 కోట్ల విలువైన మొబైల్స్ సూడాన్‌కు తరలింపు

International Cell Phone Gang Arrested And Seized 703 Mobiles

  • హైదరాబాద్‌లో అంతర్జాతీయ సెల్‌ఫోన్ల ముఠా ఆటకట్టు
  • ఈజీ మనీ కోసం సెల్‌ఫోన్ల దొంగతనం
  • మొత్తం 17 మంది అరెస్ట్
  • చోరీ చేసిన సెల్‌ఫోన్లను సూడాన్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్న ముఠా

అడ్రస్ చెప్పాలని అడుగుతారు.. చెబుతుంటే ఫోన్లు కొట్టేసి పరారవుతారు. ఆపై వాటిని సముద్ర మార్గంలో సూడాన్‌కు తరలిస్తారు. ఇలా ఒకటిరెండు కాదు.. ఏకంగా రూ. 1.75 కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లను తరలించేసిన అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కటకటాల వెనక్కి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడ్‌బండ్‌కు చెందిన మహ్మద్ ముజమ్మిల్ (19), అతడి స్నేహితుడు సయ్యద్ అబ్రార్ (19) కలిసి ఈజీ మార్గంలో డబ్బు సంపాదించేందుకు సెల్‌ఫోన్లు చోరీ చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా తొలుత ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పల్సర్ బైక్‌ను చోరీ చేశారు. బండ్లగూడ, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, మంగళ్‌హాట్‌, హయత్‌నగర్‌లో ఆ బైక్‌పై తిరుగుతూ సెల్‌ఫోన్లు దొంగతనం చేసేవారు. అనంతరం వాటిని మహ్మద్ సలీం అనే వ్యక్తికి విక్రయించేవారు. నగరంలో వరుసగా జరుగుతున్న ఈ మొబైల్ చోరీలపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో భారీ స్కాం బయటపడింది.

సెల్‌ఫోన్ల దొంగలు, రిసీవర్లు, దుకాణ నిర్వాహకులు, విక్రేతలు తదితర 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు సూడాన్ దేశస్థులు ఉన్నారు. నిందితులు ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులు చోరీ చేసిన ఫోన్లను జగదీశ్ మార్కెట్లో దుకాణాలు నిర్వహిస్తున్న మహ్మద్ షఫీ అలియాస్ బబ్లూ (28), బంజారాహిల్స్‌కు చెందిన జె.యలమందర్‌రెడ్డి (44)లకు విక్రయిస్తున్నారు. వారు ఆ ఫోన్లను సూడాన్‌‌కు చెందిన అబ్దేలా అహ్మద్ ఉస్మాన్ బాబికర్ (36), బంజారాహిల్స్‌కు చెందిన అయమ్‌ మహ్మద్‌ సాత్‌ అబ్దేలా(34), ఆనస్‌ సిద్దిగి ఆల్బేండర్‌ అహ్మద్‌(24), ఒమర్‌ అబ్దెల్లా ఇతయాబ్‌ మహ్మద్‌(27) సహకారంతో సూడాన్‌కు పంపి అక్కడ విక్రయిస్తున్నాడు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.1.75 కోట్ల విలువైన 703 స్మార్ట్‌ఫోన్లు, పల్సర్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News