YSRCP manifesto: మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం.. మా హయాంలోనే దానికి విలువ ఏర్పడింది: జగన్

AP CM Jagan Speech At YSRCP manifesto Release Programe
  • సాధ్యమయ్యేవే చెప్పాం.. చెప్పినవి చేసి చూపించామన్న ఏపీ సీఎం
  • హామీల విషయంలో చంద్రబాబుతో పోటీపడలేకపోయానన్న జగన్
  • చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే అసాధ్యమైన హామీలు ఇవ్వలేదని వెల్లడి
  • అందుకే 2014లో అధికారం దక్కనందుకు బాధపడలేదని వివరణ
ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ఓట్ల కోసం అసాధ్యమైన హామీలను ఇవ్వడం తనకు చేతకాదని, ఈ విషయంలో చంద్రబాబుతో పోటీపడలేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. సాధ్యమయ్యే, చేయగలిగే హామీలనే ఇచ్చానని వివరించారు. ఈమేరకు శనివారం వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తూ జగన్ మాట్లాడారు. మేనిఫెస్టో అంటే ఓ పవిత్ర గ్రంథం, ఓ బైబిల్, ఓ ఖురాన్, ఓ భగవద్గీత అని సీఎం చెప్పారు. ఎన్నికల సందర్భంగా పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలకు నిజమైన విలువ, గౌరవం కేవలం తన హయాంలో మాత్రమే దక్కాయని జగన్ వివరించారు. 

2014లో వైసీపీ అధికారంలోకి రాకపోవడానికి పార్టీ మేనిఫెస్టో కూడా ఓ కారణమేనని చెప్పారు. చంద్రబాబులా తాను అసాధ్యమైన హామీలను ఇవ్వలేకపోయానని, అదే తన ఓటమికి కారణమైందని వివరించారు. అయితే, అందుకు తాను బాధపడలేదని చెప్పారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే తన మిత్రులు, శ్రేయోభిలాషుల సూచనలను పెడచెవిన పెట్టానని, అసాధ్యమైన హామీలను ఇవ్వలేదని జగన్ తెలిపారు.

కిందటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని, హీరోలాగా మళ్లీ ప్రజల ముందుకు వెళుతున్నానని జగన్ పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టో కాపీలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో, కీలక అధికారుల వద్ద ఉన్నాయని చెప్పారు. ఏటేటా మేనిఫెస్టోపై ప్రోగ్రెస్ కార్డును రాష్ట్రంలోని ఇంటింటికీ పంపించామని జగన్ వివరించారు.

చంద్రబాబు మాత్రం కిందటి ఎన్నికలపుడు ప్రకటించిన హామీలను మళ్లీ ఇప్పుడు చెబుతున్నారని జగన్ ఆరోపించారు. 2019 నాటి టీడీపీ మేనిఫెస్టో కాపీని చూపిస్తూ జగన్ విమర్శల వర్షం కురిపించారు. ఆ మేనిఫెస్టో పాంప్లెట్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ ఫొటోలను చూపిస్తూ.. అప్పుడు అదే ముగ్గురితో, ఇప్పుడు అదే ముగ్గురితో కొత్త పాంప్లెట్ ను ముద్రించి పంచుతున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ అలవికాని హామీలను చెబుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు.

YSRCP manifesto
Jagan Speech
Andhra Pradesh
AP Assembly Polls

More Telugu News