Chandrababu: ఏపీలో 24 ఎంపీ స్థానాలను గెలిచి ఎన్డీయేకు అందిస్తాం: అర్నాబ్ గోస్వామికి చంద్రబాబు ఇంటర్వ్యూ
- ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని ధీమా
- ఒక్క చాన్స్ అని అడిగితే ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారన్న బాబు
- దుష్టపాలన చూశాక మరో చాన్స్ ఇవ్వరాదని నిర్ణయించుకున్నారని స్పష్టీకరణ
- ఏపీలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని వ్యాఖ్యలు
ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధిస్తుందని తమకు నూటికి నూరు పాళ్లు విశ్వాసం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ మీడియా సంస్థ 'ది రిపబ్లిక్ టీవీ' నిర్వహించిన 'దేశం తెలుసుకోవాలనుకుంటోంది' అనే కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు జవాబిచ్చారు.
160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్ సభ స్థానాల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈసారి ఎన్డీయే కూటమి 400 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఏపీ నుంచి 24 లోక్ సభ స్థానాలను ఎన్డీయే కూటమికి అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కితాబునిచ్చారు.
ఒక్క చాన్స్ అని అడిగితే జగన్ కు ప్రజలు అవకాశం ఇచ్చారని, ఈ ఐదేళ్లలో ఆయన దుష్టపాలన చూశాక మరో చాన్స్ ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని చంద్రబాబు అన్నారు. తన పాలనను, జగన్ పాలనను ప్రజలు సరిపోల్చుకుంటున్నారని, ఫలితంగా వారు తమవైపే మొగ్గుతున్నారని వివరించారు.
జగన్ కు మానసిక సమతుల్యత దెబ్బతిందని, సంక్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. వేధింపులు, విధ్వంసమే జగన్ ధ్యేయం అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గతంలో తాము ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నప్పటికీ తాను ఎలాంటి పదవిని ఆశించలేదని, కేంద్రమంత్రి పదవులను కూడా తామేమీ డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి తమవంతు భాగస్వామ్యం అందించడమే ముఖ్యమని భావించామని వెల్లడించారు. ఇప్పుడు కూడా మహోన్నత భారతావని కోసం సేవలు కొనసాగించడమే తమ అభిమతం అని చంద్రబాబు పేర్కొన్నారు.
సహజంగానే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని, అంతమాత్రాన మోదీపై వ్యతిరేకత ఉందని భావించలేమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుండడం చూస్తున్నామని, ఏపీలో కూడా బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. గత 40 ఏళ్లలో చూస్తే అనేక పర్యాయాలు టీడీపీ, బీజేపీ కలిసి పనిచేశాయని, తాము సహజ భాగస్వాములమని అభివర్ణించారు.
ఇక, తనను జగన్ జైలుకు పంపడంపై తనకేమీ కోపం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నేనేమీ తప్పు చేయలేదన్న సంగతి నాకు తెలుసు, దేశానికి తెలుసు అని వ్యాఖ్యానించారు.
అరెస్ట్ సమయంలో ప్రతి ఒక్కరూ తనకు మద్దతు ఇచ్చారని, తన క్యారెక్టర్ ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి తనకు మద్దతు లభించిందని వివరించారు.