Piyush Goyal: వయనాడ్‌లో ఓడిపోతున్నారు... రాహుల్ గాంధీ 4 లేదా 5 సీట్లలో పోటీ చేస్తే ఏదో ఒకచోట గెలవచ్చు: పీయూష్ గోయల్
- రాహుల్ గాంధీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని పీయూష్ గోయల్ సవాల్
- అమేథి నుంచి ఈసారి ప్రజలకు ముఖం చూపించలేనంత దారుణంగా ఓడిపోతారని జోస్యం
- నాలుగైదు చోట్ల పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుంటే బాగుంటుందని ఎద్దేవా
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి, ముంబై నార్త్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ అమేథి నుంచి కూడా బరిలో నిలుస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ ఈసారి వయనాడ్‌లో కూడా ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. అమేథి నుంచి కూడా సోదరి స్మృతి ఇరానీ ఈసారి రాహుల్ ప్రజలకు ముఖం కూడా చూపించలేనంత దారుణంగా ఓడించబోతున్నారన్నారు.
అందుకే ముంబై నార్త్ నుంచి కూడా తనపై పోటీ చేయాలని రాహుల్ గాంధీకి సూచిస్తున్నానని ఎద్దేవా చేశారు. వారణాసి నుంచి కూడా రాహుల్ గాంధీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఆయన నాలుగైదు సీట్లలో పోటీ చేస్తే... అప్పుడు కానీ అనుకోకుండా ఏదో ఒక సీటులో గెలిచే అవకాశముంటుందని చురక అంటించారు. బీజేపీ పాలనలో ప్రతి పైసాకు లెక్క ఉంటుందని... దేశ హితం కోసం వినియోగిస్తామని పీయూష్ గోయల్ అన్నారు. అవినీతి లేకుండా, బినామీలు లేకుండా నేరుగా లబ్ధిదారులకు నిధులను బదిలీ చేస్తున్నామన్నారు.