Indonesia: 6.5 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం
- గౌత్ రెజెన్సీకి నైరుతి వైపున 151 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున భూకంప కేంద్రం
- సునామీ వచ్చే అవకాశం లేదన్న ప్రభుత్వం
- రాజధాని జకార్తా సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు
ఇండోనేషియాలో శనివారం రాత్రి (11.29 గంటలు) భూకంపం సంభవించింది. గౌత్ రెజెన్సీకి నైరుతి వైపున 151 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 10 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు దేశ మెటియోరాలజీ శాఖ పేర్కొంది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పశ్చిమ జావా కంపించింది. రాజధాని జకార్తాతో పాటు బాంటెన్ ప్రావిన్స్, సెంట్రల్ జావా ప్రావిన్స్, యోగ్యకార్తా, తూర్పు జావా ప్రావిన్స్‌లో కూడా ప్రకంపనలు కనిపించాయి.
అయితే, భూకంపంతో సునామీ ప్రమాదం లేకపోవడంతో వాతావరణ ఏజెన్సీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. భూకంపాలు తరచూ సంభవించే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉంది. ఫలితంగా అక్కడ నిత్యం భూకంప ప్రమాదం పొంచి ఉంటుంది.