Elon Musk: ఏలియన్స్ ఉనికిపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
- 2014లో మలేషియా విమానం అదృశ్యమైన ఘటన వీడియో వైరల్
- వీడియోలో విమానం చుట్టూ తిరుగుతున్న వింత ఆకారాలు
- అవి ఏలియన్స్ వాహనాలన్న నెటిజన్
- అతడి అభిప్రాయాన్ని కొట్టిపారేసిన ఎలాన్ మస్క్
- గ్రహాంతరవాసులు ఉన్నారనేందుకు ఇప్పటివరకూ ఒక్క ఆధారం కూడా చూడలేదని వ్యాఖ్య
ఏలియన్స్ ఉన్నారనేందుకు ఆధారలేవీ తనకు ఇప్పటివరకూ దొరకలేదని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. దాదాపు పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇండోనేషియా ఎమ్‌హెచ్ 370 విమానం ఘటన వెనక ఏలియన్స్ హస్తం ఉండొచ్చన్న ఓ నెటిజన్ అనుమానాలను ఆయన తోసిపుచ్చారు. తనకు ఏలియన్స్ ఉనికిలో ఉన్నట్టు తెలిసుంటే వెంటనే ట్విట్టర్‌లో వెల్లడించి ఉండేవాడినని ఆయన అన్నారు. తన స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన 6 వేల శాటిలైట్లు భూమిచుట్టూ పరిభ్రమిస్తున్నాయని తెలిపారు. కానీ, గ్రహాంతరవాసులకు సంబంధించి తమకు ఇప్పటివరకూ ఒక్క ఆధారం కూడా లభించలేదన్నారు.
మలేషియాకు చెందిన ఎమ్‌హెచ్ 370 విమానం 2014లో బీజింగ్ వైపు వెళుతూ అకస్మాత్తుగా అదృశ్యమైంది. టేకాఫ్ అయిన 38 నిమిషాల తరువాత దక్షిణ చైనా సముద్రం మీద ప్రయాణిస్తుండగా కనిపించకుండా పోయింది.
నాటి ఘటన తాలూకు డ్రోన్ ఫుటేజీ అంటూ ఓ నెటిజన్ ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. వీడియోలో.. విమానం చుట్టూ వలయాకారంలో తిరుగుతున్న కొన్ని ఆకారాలను ఏలియన్స్‌కు చెందిన వాహనాలని పేర్కొన్నారు. వాటి చుట్టూ ఓ శక్తి వలయం కూడా ఉందని, అవి గురుత్వాకర్షణ శక్తిని జయించగలిగాయని అన్నారు. ఈ వీడియోను ఎలాన్ మస్క్‌తో పంచుకున్న మరో యూజర్ ఆయన అభిప్రాయం కోరాడు. అయితే, తాను ఇంతవరకూ ఏలియన్స్ ఉన్నాయనేందుకు ఒక్క ఆధారం కూడా చూడలేదని మస్క్ స్పష్టం చేశారు.