MDH Masala: సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన!

Untrue Lacks Evidence MDH On Presence Of Ethylene Oxide In Its Spices
  • ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలా ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ క్రిమిసంహారకం ఉందంటూ నిషేధం
  • ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఎమ్‌డీహెచ్
  • తాము ఇథిలీన్ ఆక్సైడ్ అస్సలు వినియోగించలేదని వినియోగదారులు, వ్యాపారులకు భరోసా
క్రిమిసంహారకాలు ఉన్న కారణంతో ఎమ్‌డీహెచ్ మసాలాలను సింగపూర్, హాంగ్‌కాంగ్ నిషేధించడంపై సంస్థ తాజాగా స్పందించింది. తమ మసాలా ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ క్రిమిసంహారకం ఉందన్నది నిరాధార ఆరోపణ అని పేర్కొంది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ ఉత్పత్తులు 100 శాతం భద్రమైనవని వినియోగదారులు, వ్యాపారులకు భరోసా ఇచ్చింది. 

నిషేధానికి సంబంధించి తమకు సింగపూర్ లేదా హాంగ్‌కాంగ్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని ఎమ్‌డీహెచ్ పేర్కొంది. అంతేకాకుండా, స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ వద్ద కూడా నిషేధానికి సంబంధించిన సమాచారం లేదని పేర్కొంది. కాబట్టి, ఎమ్‌డీహెచ్‌ మసాలాల్లో క్రిమిసంహారకాలు ఉన్నాయన్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. మసాలాల ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకూ ఏ దశలోనూ తాము క్రిమిసంహారకాలు వాడమని స్పష్టం చేసింది. 

సింగపూర్‌తో పాటు హాంగ్‌కాంగ్ కూడా ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై నిషేధం విధించాయన్న వార్త ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు బ్రాండ్ల ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఉండడంతో నిషేధించినట్టు తెలిపాయి. ప్రజలు ఎవరెస్టు ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని హాంగ్‌కాంగ్ ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తులను దేశంలో అమ్మొద్దని వ్యాపారులను కూడా ఆదేశించింది.
MDH Masala
Singapore
Hongkong
Pesticides
Ban
Everest Masala

More Telugu News