fatty liver: ఫ్యాటీ లివర్.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన బాధితులు
- హైదరాబాద్ లో గతంలో 10–15 మందిలో ఈ సమస్య
- ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరు బాధపడుతున్న వైనం
- వైద్యుల తాజా పరిశీలనలో వెల్లడి
ఫ్యాటీ లివర్ (కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం) సమస్యతో బాధపడున్న ప్రజల సంఖ్య హైదరాబాద్ లో క్రమంగా పెరుగుతోంది. కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అనుసరించాయి. కొన్ని కంపెనీలు ఆ పద్ధతిని నేటికీ కొనసాగిస్తున్నాయి. దీంతో నగరంలో 50 శాతం మందికిపైగా అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని వైద్యులు తేల్చారు.
తగిన వ్యాయామం లేని ఇలాంటి జీవనశైలి కారణంగా చాలామందిలో ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతోందని డాక్టర్లు తాజా పరిశోధనలో తేల్చారు. గతంలో ప్రతి 10-15 మందిలో ఒకరికి ఈ సమస్యను గుర్తిస్తే.. ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటోందని చెబుతున్నారు.
ఒకేచోట కూర్చొని గంటల తరబడి పనిచేయడం, ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్లు తెప్పించుకొని తినడం కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని వెల్లడించారు.
అవసరానికి మించి కేలరీలు తీసుకోవడంతో కాలేయంలో కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ పరిణామం చివరకు లివర్‌లో గడ్డలు ఏర్పడి లివర్ సిర్రోసిస్ వ్యాధికి దారితీస్తోందని డాక్టర్లు విశ్లేషిస్తున్నారు.
మద్యపానం వల్ల కొందరిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా కనపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అలవాటు లేని వారిలో అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్, థైరాయిడ్ సమస్యలతో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతోంది.
లివర్ చేసే పనులు వందల్లోనే..
కాలేయం జీర్ణ వ్యవస్థకు అనుబంధంగా ఉన్న అతి పెద్ద గ్రంథి అని, ఇది 500కుపైగా ప్రాణాధార పనులు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం మొదలు మందుల వరకు లివర్ మీదుగానే ప్రయాణం సాగిస్తాయని అంటున్నారు. అందువల్ల కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.