Lok Sabha: ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలు.. ఈ చిత్రమైన విషయం తెలుసా?
- స్వాతంత్ర్యం అనంతరం పరిస్థితుల్లో అమలు..
- ఒకే స్థానంలో ఒక జనరల్ ఎంపీ, ఒక రిజర్వేషన్ ఎంపీ
- తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో కొనసాగిన తీరు.. 1961 ఎన్నికల నుంచి ప్రస్తుతమున్న తీరులో రిజర్వేషన్లు అమల్లోకి..
ఏదైనా నియోజకవర్గానికి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఒక్కరే ఉంటారు. ఆ నియోజకవర్గం మొత్తానికి ఆ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ ఒక్క నియోజక వర్గానికి ఒకేసారి ఇద్దరు, ముగ్గురు ఎంపీలు ఉన్న విషయం మీకు తెలుసా?
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉండేవి. సామాజిక వర్గాల వారీ పరిస్థితులపై తీవ్ర చర్చ కొనసాగేది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను వారికే రిజర్వ్ చేయాలన్న డిమాండ్లు వచ్చాయి.
అయితే అప్పటికే రాజకీయాల్లో ముందంజలో ఉన్న అగ్రవర్ణాలు మొదట్లో దీనికి ఒప్పుకోలేదు. దీంతో అలాంటి నియోజకవర్గాల్లో ఒక జనరల్ ఎంపీ, ఒక రిజర్వేషన్ ఎంపీ.. కలిపి ఇద్దరు ఎంపీలు ఉండేలా ఏర్పాటు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇలా ముగ్గురు ఎంపీలూ ఉండే పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన తొలి రెండు సాధారణ ఎన్నికల్లో ఇది కొనసాగింది.
తొలి ఎన్నికల్లో 86 చోట్ల..
1951-52లో స్వాతంత్ర్య భారత మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మొత్తం 400 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండేవి. అందులో 314 చోట్ల ఒకే ఎంపీ ఉండగా, 86 చోట్ల ఇద్దరు చొప్పున ఎంపీలు (ఒకరు జనరల్ కేటగిరీ, మరొకరు రిజర్వేషన్ కేటగిరీ) ఉండేవారు. పశ్చిమ బెంగాల్ లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికి ముగ్గురు ఎంపీలుగా ఉన్నారు.
రెండో ఎన్నికల్లో 57 చోట్ల..
1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 494కు పెరిగింది. అప్పుడు 57 నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున ఎంపీలు ఉన్నారు. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 18 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ 8 సీట్లు ఇద్దరు ఎంపీలతో ఉండేవి.
పూర్తిస్థాయి రిజర్వేషన్ విధానంతో..
1961 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిస్థాయి రిజర్వేషన్ విధానం అమల్లోకి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను వర్తింపజేస్తూ వస్తున్నారు.