KTR: ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మళ్లీ శాసించే రోజు వస్తుంది: కేటీఆర్
- లోక్ సభ ఎన్నికల్లో 10, 12 సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు
- హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామని వ్యాఖ్య
- ఆ శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని వెల్లడి
లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10, 12 ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటే.. ఏడాదిలోపే కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకారామారావు వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా, బిడ్డ జైల్లో ఉన్నా, నమ్మినవాళ్లు మోసం చేసి వేరే పార్టీల్లోకి వెళ్తున్నా కూడా.. కేసీఆర్ బస్సుయాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని చెప్పారు. తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలేమైనా ఉంటే పక్కన పెట్టి అండగా నిలవాలని కోరారు.
అలా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కే..
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానీ.. కేంద్ర పాలిత ప్రాంతం గానీ కాకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకొనే శక్తి కూడా బీఆర్ఎస్ కే ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు.
మోదీ, రేవంత్ మోసం చేశారు
2014లో బడా భాయి మోదీ మోసం చేసి ఓట్లు దండుకున్నారని.. జన్ ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఖాతాలో వేస్తామని ఓట్లు వేయించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరిట చోటా భాయి రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం సెస్ వసూలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మళ్లీ టోల్ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు.
కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్
కరీంనగర్ లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని.. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ తరఫున ముక్కు, ముఖం తెలియని డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని విమర్శించారు.