NRI Attempt To Murder: క్షణాల్లో ఎలా చంపాలో గూగుల్‌లో వెతికి గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి.. లండన్‌లో ఎన్నారై జైలు పాలు

Indian Googled How To Kill Instantly Before Stabbing Ex Girlfriend In UK
  • 2017లో బాధితురాలితో కాలేజీలో ఉండగా హైదరాబాదీ యువకుడికి పరిచయం
  • నిందితుడి వేధింపులు భరించలేక యువతి బ్రేకప్
  • అయినా కొనసాగిన వేధింపులు, పెళ్లి కోసం నిందితుడి బలవంతం
  • 2022లో ఇద్దరూ పైచదువులకు యూకేకు వెళ్లిన వైనం
  • పెళ్లికి ఒప్పుకోని యువతిని స్థానిక రెస్టారెంట్‌లో కత్తితో గొంతుకోసి హత్యాయత్నం
  • నిందితుడికి 16 ఏళ్ల జైలు శిక్ష
రెండేళ్ల క్రితం లండన్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌ గొంతుకోసి హత్య చేసేందుకు యత్నించిన హైదరాబాదీ యువకుడికి తాజాగా 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. హత్యాయత్నానికి ముందు నిందితుడు క్షణాల్లో ఎలా చంపాలో గూగుల్‌లో వెతికినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోర్టు వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ అంబర్లకు, 2017లో కాలేజీలో చదువుతుండగా బాధితురాలు సోనా బిజుతో పరిచయం అయ్యింది. ఆ తరువాత ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అయితే, శ్రీరామ్ వేధింపులు తాళలేక సోనా అతడితో బంధాన్ని తెంచేసుకుంది. కానీ, అతడు మాత్రం ఆమె వెంట పడటం ఆపలేదు. పలు మార్లు ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్‌మెయిల్ చేసేవాడు. 

ఇదిలా ఉంటే 2022లో ఇద్దరూ పైచదువుల కోసం యూకే వెళ్లారు. అక్కడ సోనా లండన్‌లోని ఈస్ట్‌ హామ్ అనే ప్రాంతంలోని రెస్టారెంట్‌లో పనికి కుదురుకుంది. కానీ శ్రీరామ్ మాత్రం సోనాను వేధించడం ఆపలేదు. సోనాతో మాట్లాడేందుకు తరచూ ఆమె రెస్టారెంట్‌కు ఫోన్ చేసేవాడు. సోనాతో మాట్లాడాలని కోరేవాడు. ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో తరచూ ఆ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తుండేవాడు. 

ఇక ఘటన జరిగిన రోజు కూడా శ్రీరామ్ ఆ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డరిచ్చారు. కానీ ఆమె మాత్రం ఇతర కస్టమర్లతో వ్యవహరించినట్టే అతడితో వ్యవహరించింది. ఈలోపు ఫోన్‌లో ఏదో చూసి శ్రీరామ్ ఆమెను మళ్లీ బెదిరించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానన్నాడు. కానీ, ఆమె పెళ్లికి అంగీకరించకపోవడంతో కత్తి తీసుకుని ఆమె గొంతు కోసేశాడు. ఏకంగా తొమ్మిది సార్లు ఒంటిపై పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఆమె కోలుకునేందుకు ఏకంగా నెల రోజులు పట్టింది. హత్యాయత్నానికి మునుపు నిందితుడు గూగుల్‌లో పలు అంశాలు సెర్చ్ చేశాడు. ‘క్షణాల్లో హత్య ఎలా చేయాలి’, ‘లండన్‌లో విదేశీయుడు హత్య చేస్తే ఏమవుతుంది?’, ‘కత్తితో చంపడం ఎలా?’ అని ఆన్‌లైన్‌లో వెతికినట్టు దర్యాప్తులో తేలింది.
NRI Attempt To Murder
London
Girlfriend
Crime News
16 year Jail Term

More Telugu News