Nara Lokesh: సీఎం జగన్ డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు: నారా లోకేశ్
- 'జగన్ అండ్ కో'తో సినిమా తీస్తే ఆస్కార్ గ్యారెంటీ అని టీడీపీ నేత ఎద్దేవా
- గులకరాయి తగిలి జగన్ నుదిటిపై ఏర్పడిన గాయం.. బస్సు యాత్ర ముగియగానే ఎలా మాయమైపోయిందని విమర్శ
- అధికారంలోకి రాగానే ఐదు కోట్ల ఆంధ్రులు తలెత్తుకునేలా రాజధానిని పూర్తి చేస్తామన్న లోకేశ్
- చంద్రబాబు విజనరీ అయితే.. జగన్ ప్రిజనరీ అంటూ చురకలు
టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేశ్ మరోసారి సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. గులకరాయి తగిలి జగన్ నుదిటిపై ఏర్పడిన గాయం.. బస్సు యాత్ర ముగియగానే ఎలా మాయమైపోయిందని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. 'సీఎం జగన్ అండ్ కో'తో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి రాగానే ఐదు కోట్ల ఆంధ్రులు తలెత్తుకునేలా రాజధానిని పూర్తి చేస్తామన్నారు. తెలుగు వాళ్లు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని, వారికి మన రాష్ట్రంలో అవకాశాలు సృష్టిస్తామని తెలిపారు. చంద్రబాబు విజనరీ అయితే.. జగన్ ప్రిజనరీ అని లోకేశ్ ఈ సందర్భంగా చురకలంటించారు. ప్రజల బిడ్డనంటూ పదేపదే చెప్పే జగన్.. ఇప్పుడు వారి భూములు కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త పథకానికి తెరతీశారని దుయ్యబట్టారు. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అసలు వారి వద్ద ఉంచుకొని, నకళ్లు యజమానులకు ఇస్తామనడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఏమరుపాటుగా ఉంటే మొత్తం ఆస్తినే కొట్టేస్తారన్నారు.