Gutha Amit: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్.. వీడియో ఇదిగో!
- కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగా ఘటన
- ఇటీవలే పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
- ఇప్పుడు సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరిన అమిత్
- దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో చేరిక
సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా పార్టీని నిలబెట్టాలని కాళ్లకు బలపం కట్టుకుని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. గత ఐదు రోజులుగా ప్రజల్లోనే ఉంటూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడంతోపాటు పార్టీ నేతలు ‘చే’జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన బస్సు యాత్రలో ఉండగానే మరో వికెట్ పడిపోయింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీని కలిసిన అమిత్.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇటీవల గుత్తా సుఖేందర్ కూడా పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. అధినేత కేసీఆర్, నాయకుల తీరును తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఆరు నెలలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, తనకే అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మిగతా వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఓటమిపై ఇప్పటి వరకు సమీక్ష చేయలేదని మండిపడ్డారు. దీంతో ఆయన కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన దానిని కొట్టిపడేశారు. ఇప్పుడాయన కుమారుడు సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరడం బీఆర్ఎస్‌లో కలవరం రేపింది.