Brother Anil Kumar: ఇక్కడ మేనేజ్ చేసుకున్నాంలే అనుకున్నా దేవుడి వద్ద మేనేజ్ చేసుకోలేరు: షర్మిల భర్త అనిల్ కుమార్
- కడప జిల్లా బద్వేలులో బ్రదర్ అనిల్ కుమార్ ప్రెస్ మీట్
- వివేకా హత్య ఘటనపై కీలక వ్యాఖ్యలు
- తప్పు ఎక్కడున్నా తప్పేనని వెల్లడి
- తప్పును కప్పిపుచ్చాలని చూస్తే రేపైనా దాని ప్రభావం తగులుతుందని స్పష్టీకరణ
- వివేకాకు బలహీనతలు ఉన్నప్పటికీ మంచి తండ్రి, మంచి నాయకుడు అని కితాబు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ కడప జిల్లా బద్వేలులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పు ఎక్కడున్నా తప్పేనని, తప్పును కప్పిపుచ్చాలని చూస్తే, ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లకి ఆ ప్రభావం తగులుతుందని అన్నారు. ఇప్పటికే ఆ తప్పును కప్పి పుచ్చి, కప్పి పుచ్చి ఒక కుప్పలాగా తయారుచేశారని ఓ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. దేవుడు పదవి ఇచ్చింది న్యాయం చేయడానికి అని బ్రదర్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
"రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా వ్యక్తిగతంగా పోవద్దు... దేవుడు అధికారం ఇచ్చింది మేలు చేయడానికి... అంతేతప్ప విచ్చలవిడిగా చేయడానికి కాదు. గత ఎన్నికల్లో దేవుడు 151 సీట్లు ఇచ్చాడు, టీడీపీకి 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లే ఇచ్చాడు. ఎందుకంటే... గతంలో జగన్ గారి నుంచి టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను తీసుకుంది. గత ఎన్నికల్లో దేవుడు అవే టీడీపీకి ఇచ్చాడు. దేవుడు ఈయనకు 151 ఇచ్చాడు... ఒకటి మిగిలిపోవడంతో అది తీసుకెళ్లి జనసేనకు ఇచ్చాడు.
1999లో నేను ఒక కారు కొన్నాను. నేను దేవుడితో సహవాసం ఎక్కువగా చేస్తాను... దాంతో, కారుకు ఏ నెంబరు తీసుకోవాలి అని ఆయనను అడిగాను. ఆ క్రమంలో Jesus Christ అనే అర్థం వచ్చేలా... నెంబరు ఎంచుకున్నాను. A,B,C,D వరుసక్రమంలో J అనే అక్షరం 10వది అవుతుంది. ఆ తర్వాత E అంటే 5వ అక్షరం... ఆ విధంగా Jesus Christ పేరులోని అక్షరాలన్నీ లెక్కపెడితే 151 అని వచ్చింది.
జగన్ గారికి కూడా దేవుడు అదే 151 నెంబరు ఇచ్చాడు. ఎందుకుంటే... అరే బాబూ... నీకు అధికారం నేను ఇస్తున్నాను అని చెప్పాడు. నేను కష్టపడ్డాను కాబట్టి దేవుడు ఇచ్చాడు అనుకోవద్దు. కూలీలు రోజంతా కష్టపడతారు... కష్టపడ్డారు కదా అని వాళ్లు కోటీశ్వరులైపోతున్నారా? అందుకే దేవుడి దయ ఉండాలని అంటాను. దేవుడు తన కృప చూపించినప్పుడు మీరు మేలు చేయండి. ఏది విత్తుతావో దాన్నే కోస్తావు అని చెబుతారు.
ఈరోజుల్లో జనాల్లో భయం లేకుండా పోయింది. దేవుడు లేడు, ఏమీ లేదు అంటున్నారు. ఎవరు ప్రార్థించినా... నన్ను, నా కుటుంబాన్ని దీవించు అంటున్నారు. సంబంధాలు పెంచుకోవడంపై ఎవరూ దృష్టి సారించడంలేదు. సంబంధాలు పెంపొందించుకుంటే, జీవితంలో మనం దారితప్పినా దేవుడు సరైన మార్గంలో పెడతాడు. అందుకు నా జీవితమే నిదర్శనం. ఒకప్పుడు నేను జీవితంలో దారితప్పాను. నన్ను తీసుకొచ్చి సక్రమంగా నిలిపాడు దేవుడు.
రాజకీయంలో అయినా, దైనందిన జీవితంలో అయినా అన్యాయం అన్యాయమే. అన్యాయం చేసినవాడికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నాంలే అనుకున్నా దేవుడి వద్ద మేనేజ్ చేసుకోలేరు. దేవుడు మనిషికి అధికారం ఇచ్చినా... ఇవాళ మనుషుల్లో పదవీ వ్యామోహం పెరిగిపోయింది, స్వార్థం నెలకొంది. ఏసు ప్రభువు ఒక మార్గం చూపించాడు... ఆ మార్గంలో నడిస్తే మనకు మేలు జరుగుతుంది. మేలు అంటే డబ్బు ఒక్కటే కాదు.
ఆ ఘటన (వివేకా హత్య) చాలా బాధాకరం. ఆ వయసులో ఆయనకు అలా జరగడం చాలా వేదన కలిగించే విషయం. ఎవరికైనా ఇలాంటి ఘటన జరిగితే దాన్ని అన్యాయం అని ఖండించాల్సిందే. అలా జరిగింది కదా అని ఆ ఘటనను సపోర్ట్ చేయడం కూడా మంచిది కాదు. దేవుడు ఇలాంటి వాటిని మన విచక్షణకే వదిలేస్తున్నాడు.
ఆయనకు ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ... ఆయన (వివేకా) ఒక మంచి తండ్రి, మంచి నాయకుడు ఆయన. ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండేవారని నాకు కొందరు చెప్పేవాళ్లు... ఏదీ లేకపోతే ఆటోలో వెళ్లేవారని, నడుచుకుంటూ వెళ్లేవారని చెప్పేవారు. రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాదులో ఉన్నప్పుడు ఆయనే (వివేకా) ఇక్కడ (పులివెందుల) అన్ని విషయాలు చూసుకునేవారట. రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడిభుజంలా ఉన్నారు.
చివరగా ఒక్క విషయం చెబుతాను... న్యాయానికి ఎప్పుడూ విజయమే. డబ్బు ఉంది కదా అని దయచేసి కక్కుర్తి పడొద్దు. యథా రాజా తథా ప్రజ. రాజు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలి... చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవని చెబుతారు. అదేంటో గానీ ఆయన వస్తే వర్షాలు పడవు. ఒక్కొక్కరి ప్రభావం అలా ఉంటుంది.
ఎవరొచ్చినా, ఎవరు ఏం చేసినా, మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పింది చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా అనుకోవద్దు... ఒక తటస్థ వ్యక్తిగా ఈ మాట చెబుతున్నాను.
మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుంది... అలాగని చంద్రబాబు గారు మంచి చేయలేదు అని కాదు, రాజశేఖర్ రెడ్డి గారు తదితర నేతలు మంచి చేయలేదు అని కాదు. అందరూ మంచి చేశారు. దేవుడు కూడా వారినీ, వీరినీ దీవించాడు" అంటూ అనిల్ కుమార్ వివరించారు.