Janasena: ఎన్డీయే పార్టీల్లో జనసేన ‘గాజు గ్లాస్ గుర్తు’ కలవరం!
- ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు ఉండడంతో పార్టీల్లో టెన్షన్
- జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకే ఈ గుర్తు కేటాయించే అవకాశం
- జనసేన అనుకొని ఇతర పార్టీలకు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కూటమి నేతల ఆందోళన
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాస్’ను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చుతూ 10 రోజుల క్రితం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో ఎన్డీయే కూటమి పార్టీలను కలవరానికి గురిచేస్తోంది. జనసేన అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ సింబల్‌ను కేటాయించనుండంతో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు ఆందోళన చెందుతున్నాయి. జనసేన అభ్యర్థి అనుకొని ఇతరులకు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జనసేన అభ్యర్థులు పోటీలో లేనిచోట్ల ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసు నష్టం చేయవచ్చునని కూటమి పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిష్కారానికి జనసేన పార్టీ చివరి ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. అనూహ్యంగా చివరిలో ఏదైనా మార్పు జరిగితే బావుంటుందని కూటమి నేతలు భావిస్తున్నారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో 6 శాతం సాధించాల్సి ఉంటుంది. నిర్దేశిత శాతంలో ఓట్లతో పాటు కనీసం 2 సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 6 శాతం ఓట్లు సాధించినప్పటికీ 2 సీట్లు సాధించలేకపోయింది. ఫలితంగా ఆ పార్టీ తన గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. గతంలో బద్వేలు, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు ఎన్నికల సంఘం కేటాయించింది. తాజా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమి పార్టీ నాయకులు, శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.