Pawan Kalyan: నవ్వుతూ ఉండే ఆ తండ్రి లేని బిడ్డ ఫొటో మనకెందుకు?: పవన్ కల్యాణ్

Pawan Kalyan comments on CM Jagan

  • ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయభేరి సభ
  • సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల వాసుపై పవన్ కల్యాణ్ విమర్శలు
  • ఎమ్మెల్యే అయి ఉండి సొంత ఇంటికి దారి లేదని ఎద్దేవా
  • కానీ పేకాట క్లబ్బులు మాత్రం నడుపుతాడంటూ వ్యాఖ్యలు 

జనసేనాని పవన్ కల్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అయి ఉండి సొంత ఇంటికే దారి వేయించుకోలేని వ్యక్తి... మన దారులు ఏం పూడ్చుతాడు, మన రోడ్లు ఏం వేస్తాడు? అంటూ పవన్ విమర్శించారు. 

ఆయనకు పేకాట క్లబ్బులు నడపాలని సరదా ఉంటే అందుకు నేనేం కాదనను... ఆయన పేకాట క్లబ్బులు బాగా నడిపినందుకు రూ.30 లక్షల కారు కూడా ఇచ్చారంట! అని పవన్ వ్యాఖ్యానించారు. మనకేం కావాలి... పేకాట క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా? పేకాట క్లబ్బులు కావాలా? ఉపాధి అవకాశాలు కావాలా? ఇది పేకాట ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. జగన్ నాయకత్వంలో ఏవైనా అభివృద్ధి చెందాయా అంటే అవి పేకాట క్లబ్బులు, ఇసుక దోపిడీ, మద్యం మాత్రమేనని అన్నారు. వైసీపీ ఓడిపోయే పార్టీ అని, ఓడిపోయే పార్టీ గురించి ఎక్కువ మాట్లాడనక్కర్లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

"ఏపీలో గజం స్థలం ఉన్నవాళ్లయినా సరే... సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగన్ దే అయిపోతుంది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీవి, జగన్ వి అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలను కూడా తాకట్టు పెట్టేస్తాడు. వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులను మీరే పెట్రోల్ పోసి తగలబెట్టినట్టే. 

మన భూమికి సంబంధించిన ఒరిజనల్ పత్రాలు వాళ్ల దగ్గర పెట్టుకుంటారట. ప్రజలకు మాత్రం జిరాక్స్ కాపీలు ఇస్తారట. మీరు గమనించండి... భారతదేశ పాస్ పోర్టు మీద నరేంద్ర మోదీ గారి బొమ్మ ఉండదు. భారత రాజ్యాంగం తాలూకు, మూడు సింహాల రాజముద్ర ఉంటుంది.

కానీ మన ఆస్తి పత్రాల మీద జగన్ బొమ్మ ఎందుకు... దరిద్రంగా! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్ర ఉండాలి. నవ్వుతూ ఉండే ఆ తండ్రి లేని బిడ్డ ఫొటో మనకెందుకు? తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పునరుద్ధరిస్తాం" అంటూ పవన్ కల్యాణ్ వివరించారు.

  • Loading...

More Telugu News