Telangana: తెలంగాణలో ఇప్పటి వరకు రూ.76.65 కోట్ల నగదు స్వాధీనం
- రూ.43.57 కోట్ల మద్యంను పట్టుకున్న అధికారులు
- రూ.29.62 కోట్ల విలువైన 118 కిలోల బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం
- రూ.26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువుల స్వాధీనం
లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటివరకు రూ.202 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రూ.76.65 కోట్ల నగదును, రూ.43.57 కోట్ల మద్యం, రూ.29.62 కోట్ల విలువైన 118 కిలోల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే రూ.26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో నేడు భారీగా నగదు పట్టివేత
సోమవారం హైదరాబాద్‌లో రూ.1,96,70,324 నగదును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి ఎనిమిది ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాలలో రూ.1,81,70,324 నగదు పట్టుబడింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యధికంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.74 లక్షలకు పైగా పట్టుకున్నారు.