Revanth Reddy: అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు: సీఎం రేవంత్ రెడ్డిపై పెట్టిన కేసు సెక్షన్లు ఏమిటో, ఆ నేరాలు, శిక్షలేమిటో తెలుసా?

Amit Shah deep fake video case what are the sections of the case against CM Revanth Reddy and what are the crimes
  • ఐటీ, ఐపీసీ చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • రెచ్చగొట్టడం, దాడికి ప్రేరేపించడం వంటి ఆరోపణలు
  • ఆ సెక్షన్ల కింద జైలు శిక్షలు, జరిమానాలు విధించే అవకాశం
కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వస్తే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా డీప్ ఫేక్ వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ పోలీసులు కేసు నమోదు చేశారు కూడా. దీనికి సంబంధించి వారు ఐటీ చట్టంలోని సెక‌్షన్‌ 66సీ, ఐపీసీలోని 153/ 153ఏ/ 465/ 469/ 171జీ సెక‌్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఆయా సెక‌్షన్లను ఏయే నేరాలకు సంబంధించి నమోదు చేస్తారో తెలుసుకుందాం..

ఐటీ చట్టంలోని  సెక‌్షన్‌ 66సీ 
ఆన్‌లైన్‌/ఇంటర్నెట్‌లో ఎవరైనా వ్యక్తుల గుర్తింపును మోసపూరితంగా, వారి పరువుకు భంగం కలిగేలా వినియోగిస్తే ఈ సెక్షన్ పెడతారు. దీని కింద గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది.

ఐపీసీ సెక‌్షన్‌ 153 
ఎవరైనా వ్యక్తులపై ఉద్దేశపూర్వకంగా ఇతరులను రెచ్చగొడితే.. దాడికి ప్రేరేపించేలా చేస్తే ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. దీని కింద ఏడాది వరకు జైలుశిక్ష, జరిమానా.. లేదా రెండింటినీ విధించవచ్చు.

ఐపీసీ సెక‌్షన్‌ 153 ఏ
ఎవరైనా మతం, వర్గం, కులం, భాష, సంస్కృతి, ప్రాంతం వంటి అంశాలను లేవనెత్తుతూ.. వివిధ వర్గాల మధ్య వివాదాలను, విద్వేషాన్ని పెంచేలా ప్రవర్తిస్తే, మాట్లాడితే ఈ సెక్షన్ పెడతారు. దీని కింద కూడా ఏడాది వరకు జైలుశిక్ష, జరిమానా, లేదా రెండూ  విధించేందుకు అవకాశం ఉంటుంది.

ఐపీసీ సెక‌్షన్‌ 465
ఎవరైనా వ్యక్తుల ఐడెంటిటీని, సంతకాన్ని, వారికి సంబంధించిన వ్యక్తిగత అంశాలను ఫోర్జరీ చేస్తే ఈ సెక్షన్ నమోదు చేస్తారు. గరిష్ఠంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.

ఐపీసీ సెక‌్షన్‌ 469
ఎవరైనా వ్యక్తులే గాకుండా సంస్థల పరువును దెబ్బతీసేలా వ్యవహరిస్తే.. ఉద్దేశపూర్వకంగా పత్రాలు/ఎలక్ట్రానిక్‌ రికార్డులను ఫోర్జరీ చేస్తే ఈ సెక‌్షన్‌ పెడతారు. దీని కింద గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది.

ఐపీసీ సెక‌్షన్‌ 171 జి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కించ పర్చేలా, వారి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడటం, ప్రచారం చేయడం.. మొత్తంగా ఎన్నికల ఫలితాలపై ఎఫెక్ట్ పడేలా చేయడం ఈ సెక్షన్ కిందకు వస్తాయి. అయితే ఈ సెక‌్షన్‌ కింద కేవలం జరిమానా విధించేందుకు మాత్రమే చాన్స్ ఉంది. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు నలుగురు రాష్ట్ర నేతలపై, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ల ఇన్ చార్జులపై ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Revanth Reddy
Telangana
Amit Shah
fake video
Deepfake
TS Politics
offbeat

More Telugu News