Balakot Strikes: బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ పై మోదీ సంచలన వ్యాఖ్యలు!
- దాడి విషయం పాకిస్థాన్ కే ముందు చెప్పామన్న ప్రధాని
- ఆ తర్వాతే మీడియాకు వెల్లడించినట్లు వివరణ
- కర్ణాటకలోని బాగల్ కోట్ ఎన్నికల ప్రచారంలో వెల్లడి
సర్జికల్ స్ట్రయిక్స్.. ఉగ్రవాదుల పీచమణచడానికి దాయాది దేశం పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ భారత వైమానిక దళం జరిపిన దాడులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఈ దాడుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులు జరిపిన తర్వాత ముందు పాకిస్థాన్ ప్రభుత్వానికి సమాచారం అందించామని, ఆ తర్వాతే ప్రపంచానికి వెల్లడించామని మోదీ పేర్కొన్నారు. ఈమేరకు కర్ణాటకలోని బాగల్ కోట్ లో సోమవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మోదీ ఈ విషయాన్ని బయటపెట్టారు.
శత్రువుకు ఎదురు నిలిచి పోరాడడమే మోదీకి తెలుసని, వెనకనుంచి దాడి చేయడం తన విధానం కాదని ప్రధాని చెప్పారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులను వెతుక్కుంటూ వెళ్లి దాడి చేశామని వివరించారు. దాడుల తీవ్రతను, దానివల్ల ఏర్పడిన విధ్వంసం గురించి ప్రపంచానికి వెల్లడించాలని ఆర్మీకి సూచించానని మోదీ చెప్పారు. అయితే, మీడియాకు వెల్లడించేందుకు ముందే జరిగిన నష్టం గురించి పాక్ కు సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. పాక్ కు సమాచారం అందించేందుకు ఆలస్యం జరిగింది.. అయినప్పటికీ వేచి చూసి, పాక్ కు తెలియజేశాకే మీడియాకు వెల్లడించామని వివరించారు. మోదీ ఏంచేసినా అందరికీ తెలిసేలాగానే చేస్తాడని, చాటుమాటు వ్యవహారాలు తెలియవని చెప్పారు.