China Highway: సడెన్ గా కుంగిన రోడ్డు.. చైనాలో 19 మంది మృతి.. వీడియో ఇదిగో!
- రోడ్డులో కొంతభాగం కూలిపోవడంతో భారీ గుంత
- ఆ గోతిలో పడిపోయిన 18 వాహనాలు
- ఇటీవల వర్షాలు ముంచెత్తిన గ్వాంగ్ డాంగ్ సిటీలో ఘటన
చైనాలోని ఓ జాతీయ రహదారి ఉన్నట్టుండి కుంగిపోయింది.. క్షణాల వ్యవధిలో రోడ్డులోని కొంతమొత్తం కూలిపోయింది. దీంతో హైవేపై భారీ గుంత ఏర్పడింది. ఇదంతా సడెన్ గా చోటుచేసుకోవడంతో రోడ్డుపై వేగంగా దూసుకెళుతున్న వాహనాలు ఆ గోతిలో పడిపోయాయి. దీంతో 19 మంది చనిపోయారు. సౌత్ చైనాలోని గ్వాంగ్ డాంగ్ సిటీ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా మీడియా కథనాల ప్రకారం.. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మీజౌ, డాబు కౌంటీ ల మధ్య హైవే కూలిపోయింది.
ఈ ప్రమాదంలో 18 వాహనాలు గోతిలో పడిపోయాయి. అందులో ప్రయాణిస్తున్న పందొమ్మిది మంది చనిపోగా, 49 మంది గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో స్థానికులతో కలిసి మొత్తం 500 మందికి పైగా పాల్గొన్నారు.
వర్షాలే కారణమా..?
సౌత్ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ ను ఇటీవల వర్షాలు ముంచెత్తాయి. వాతావరణ మార్పులు, వరదలు, సుడిగాలుల వంటి వాటివల్ల కూడా రోడ్డు కుంగిపోయి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడికి దగ్గర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఉన్నట్టుండి రోడ్డు దిగబడిపోవడంతో పలు వాహనాలు ఆ భారీ గోతిలో పడిపోయాయి. గోతిలో నుంచి భారీగా పొగ వెలువడడం వీడియోలో చూడొచ్చు.