Australia: టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక... కెప్టెన్ గా మిచెల్ మార్ష్
- జూన్ 1 నుంచి 29 వరకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్
- అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో మెగా టోర్నీ
- 15 మందితో జట్టును ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
- అనుభవానికి పెద్ద పీట
- 2021 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులోని 11 మంది ఎంపిక
వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆసీస్ జట్టుకు మిచెల్ మార్ష్ ను కెప్టెన్ గా నియమించారు.
మాజీ సారథి స్టీవ్ స్మిత్ కు వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించలేదు. గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో స్మిత్ పేలవంగా ఆడడమే అందుకు కారణం.
ఇక ఐపీఎల్ తాజా సీజన్ లో సంచలన బ్యాటింగ్ ప్రదర్శనలు నమోదు చేస్తున్న జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కు కూడా ఆసీస్ జాతీయ జట్టులో స్థానం లభించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇటీవల చెత్తగా ఆడుతున్న డేవిడ్ వార్నర్ జట్టులో స్థానం నిలుపుకోవడం అంతకంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.
టోటల్ గా జట్టు ఎంపిక చూస్తే అనుభవానికి పెద్దపీట వేశారని తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టు 2021లో టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవగా, నాటి జట్టులోని 11 మందికి నేడు ఎంపిక చేసిన జట్టులో స్థానం కల్పించారు.
జట్టులో ప్రధాన పేసర్లుగా పాట్ కమిన్స్, జోష్ హేజెల్ వుడ్ కొనసాగుతారు. ఆల్ రౌండర్ కోటాలో మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ కూడా బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్ రూపంలో జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేశారు.
ఆస్ట్రేలియా జట్టు...
మిచెల్ మార్ష్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, టిమ్ డేవిడ్, ఆష్టన్ అగర్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్, నాథన్ ఎల్లిస్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజెల్ వుడ్, ఆడమ్ జంపా.
ఈసారి టీ20 టోర్నీలో ఏకంగా 20 జట్లు పాల్గొంటుండడం విశేషం. పలు ఐసీసీ అసోసియేట్ దేశాల జట్లకు కూడా ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం కల్పించారు. టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో వివిధ వేదికల్లో జరగనుంది.