Pawan Kalyan: తగ్గేదే లే, నాకో తిక్కుంది దానికో లెక్కుంది అని చేతులూపి వెళ్లిపోగలను... కానీ!: పవన్ కల్యాణ్

Pawan Kalyan says he entered into politics for the people

  • అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో వారాహి సభ
  • రోడ్లమీదికి వచ్చి పోరాడడం తనకేమీ సరదా కాదన్న పవన్
  • ప్రజల కోసం ప్రాణాలకు తెగించి ఓ నయవంచకుడితో పోరాడుతున్నానని వెల్లడి
  • సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉంటే సీఎం అవుతానని వ్యాఖ్యలు 
  • మొదట జనసేనకు రాజకీయ గుర్తింపు తీసుకురావాల్సి ఉందని స్పష్టీకరణ

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, రోడ్లమీదికి వచ్చి పోరాడడం తనకేమీ సరదా కాదని... తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. 

తాను కూడా అందరిలాగే... తగ్గేదే లే, నాకో తిక్కుంది దానికో లెక్కుంది అని చేతులూపి వెళ్లిపోగలనని, సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోగలనని అన్నారు. శ్రీశ్రీని చదివింది దేనికి? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ను చదివింది దేనికి? రాజకీయాల్లోకి వచ్చింది సగటు మనిషిలా ఉండిపోవాలని కాదు, జనసేన పార్టీ పెట్టింది సగటు మనిషిలా ఉండిపోవాలని కాదు... సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి ఒక నయవంచకుడితో, ఒక గూండాతో, ఒక దోపిడీదారుడితో మీ తరఫున మీ గళమై, మీ గుండె చప్పుడై పోరాడుతున్నాను అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. 

ఇక, సభకు వచ్చినవారు సీఎం సీఎం అంటూ అరుస్తుండడం పట్ల పవన్ స్పందించారు. "గత దశాబ్దకాలంగా మీరు సీఎం సీఎం అని అరుస్తున్నారు. జనసేన ఒక గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీ కావాలి... అందుకోసమే నేను ప్రయత్నిస్తున్నాను. ఇదే మన మొదటి బాధ్యత. ఆ తర్వాత మీ కోరిక ప్రకారం, సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అందిస్తే అప్పుడు చూద్దాం. ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలి. 

కానీ పవన్ కల్యాణ్ చేతుల్లో ఏముందంటే మీకోసం ఒక ముఠా కూలీలాగా, ఒక భవన నిర్మాణ కార్మికుడు ఎలా ఒళ్లు వంచి శ్రమిస్తాడో అలా పనిచేస్తా. మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేనొస్తా, మన ఎస్ఈజెడ్ లో మీకు అన్యాయం జరిగితే నేనొస్తా. ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ను, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ను గెలిపించండి" అంటూ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News