Congress: తృణమూల్ కంటే బీజేపీకి ఓటేయడం బెటర్: కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
- బెంగాల్ ప్రచార సభలో వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి
- బీజేపీకి బీ టీంగా పని చేస్తోందని కాంగ్రెస్‌పై తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు
- అధిర్ రంజన్ ఏ సందర్భంలో అన్నారో తెలియదన్న జైరామ్ రమేశ్
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఓటు వేయడం కంటే బీజేపీకి వేయడం బెటర్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతున్నాయి. జాతీయస్థాయి కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, టీఎంసీలు బెంగాల్‌లో మాత్రం వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీకి కాంగ్రెస్ బీ-టీమ్‌గా పని చేస్తోందని ఆరోపించింది. అయితే టీఎంసీ తమ మిత్రపక్షమని, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్ సభ పరిధిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో అధిర్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్.. అధిర్ రంజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మమతా బెనర్జీ పోరాడుతుంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాత్రం బీజేపీకి ఓటు వేయమని చెప్పడం ఏమిటని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ స్పందించారు. బెంగాల్‌లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అధిర్ రంజన్ ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలియదన్నారు. రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేయడమే తమ ధ్యేయమన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుందని, ఈ సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు.