Israel: గాజాపై దాడులకు నిరసనగా కొలంబియా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన.. 300 మంది అరెస్ట్
- అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో విద్యార్థుల నిరసనలు
- గాజాపై కాల్పులు ఆపాలని డిమాండ్
- కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన ఘర్షణల్లో 15 మందికి గాయాలు
గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా యూనివర్సిటీల విద్యార్థులు తమ నిరసనను ఉద్ధృతం చేస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ, సిటీ కాలేజీలో ఆందోళనకు దిగిన 300 మంది విద్యార్థులను న్యూయార్క్ సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన ఘర్షణల్లో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు.
అక్టోబరు7న హమాస్ ఉగ్రవాదులు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడికి దిగారు. ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఇది క్రమంగా యుద్ధం రూపం దాల్చి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల్లోనూ భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఇంకోవైపు, పాలస్తీనాపై దాడులను నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపాలని, కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొలంబియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిరసన కాస్తా హింసాత్మకంగా మారడంతో 15 మంది గాయపడ్డారు. తాజా ఘర్షణలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో కాలిఫోర్నియా టీచర్స్ ఫెడరేషన్ రాజీనామాకు పిలుపునిచ్చింది.