Powerball Jackpot: క్యాన్సర్ బాధితుడికి జాక్‌పాట్.. రూ. 10వేల కోట్ల లాటరీ!
- క్యాన్సర్‌తో పోరాడుతున్న చెంగ్ సైఫాన్ అనే వ్యక్తికి పవర్‌బాల్ లాటరీలో కలిసొచ్చిన అదృష్టం
- భార్య, స్నేహితుడుతో కలిసి పవర్ బాల్‌లో 20 లాటరీ టికెట్లు కొన్న క్యాన్సర్ బాధితుడు
- ఏప్రిల్ 7న తీసిన డ్రాలో సైఫాన్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్లకు జాక్‌పాట్
అమెరికాలో క్యాన్సర్‌తో పోరాడుతున్న చెంగ్ సైఫాన్ అనే వ్యక్తికి పవర్‌బాల్ లాటరీలో జాక్‌పాట్ తగిలింది. దీంతో ఏకంగా 1.3 బిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల రూ. 10వేల కోట్లు. భార్య, స్నేహితుడితో కలిసి అతడు పవర్ బాల్‌లో 20 లాటరీ టికెట్లు కొన్నాడు. ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఏప్రిల్ 7న తీసిన డ్రాలో లాటరీ నిర్వాహకులు సైఫాన్‌ను జాక్‌పాట్ విజేతగా ప్రకటించారు.
అతడు ఏకంగా రూ. 10వేల కోట్లు గెలుచుకున్నట్లు వెల్లడించారు. ఇక ట్యాక్సులు పోగా ఒకేసారి తనకు 422 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,522కోట్లు) చెల్లించేలా లాటరీ నిర్వాహకులతో సైఫాన్ ఒప్పందం చేసుకున్నాడు. తనకు వచ్చే డబ్బులో సగం స్నేహితుడికి ఇస్తానని సైఫాన్ తెలిపాడు.
ఈ సందర్భంగా సైఫాన్ మాట్లాడుతూ.. "ఇప్పుడు నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోగలను. నా కోసం ఒక మంచి వైద్యుడిని నియమించుకోగలను. నా జీవితం మారిపోయింది. ఇన్నాళ్లు సహాయం కోసం దేవుడిని ప్రార్థించాను. ఇప్పటికి దేవుడు నా మొర అలకించాడు" అని చెప్పుకొచ్చాడు.
ఇక తనకు దక్కిన భారీ మొత్తంలో కొంత భాగాన్ని తన కలల సౌధాన్ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పవర్‌బాల్ ఆడటాన్ని ఇకపై కూడా కొనసాగిస్తానన్నాడు. కాగా, క్యాన్సర్ బాధితుడైన సైఫాన్‌కు గత ఎనిమిదేళ్లుగా కీమోథెరపీ చికిత్స కొనసాగుతోంది.
ఇదిలాఉంటే.. పవర్‌బాల్ లాటరీ చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద జాక్‌పాట్ అని బీబీసీ తెలిపింది. 2022లో ఓ వ్యక్తికి ఏకంగా 2.04 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ తగిలింది. పవర్‌బాల్ హిస్టరీలో ఇప్పటివరకు ఇదే అత్యధికం.