Hyderabad Metro: రాజస్థాన్ వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సర్వీసు పొడిగింపు
- నేటి రాత్రి 1 గంట వరకు సర్వీసులు ఉంటాయని ప్రకటన
- చివరి ట్రైన్ రాత్రి 12:15 గంటలకు ప్రారంభమై 1:10 గంటలకు గమ్యస్థానం చేరుతుందని వెల్లడి
- ఐపీఎల్ మ్యాచ్ వేళ క్రికెట్ ఫ్యాన్స్ కోసం మెట్రో నిర్ణయం
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు (గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. ఈ రోజు (గురువారం) రాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. రాత్రి 12:15 గంటలకు చివరి మెట్రో రైలు ప్రారంభమై 1:10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది.
ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికుల ప్రవేశానికి అనుమతి ఉంటుందని, ఎక్కడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. మిగతా స్టేషన్లలో దిగే వారికే అనుమతి ఉంటుందని హైదరాబాద్ మెట్రో వివరించింది.
కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నేటి మ్యాచ్ చాలా కీలకమైనది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్ స్థానం ఇప్పటికే ఖరారైంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ ఏకంగా 8 విజయాలు సాధించింది. 16 పాయింట్లలో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.