SRH: టాస్ గెలిచిన సన్ రైజర్స్... ఏమీ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్
- గత రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన సన్ రైజర్స్
- రెండు సార్లూ ఛేజింగ్ లో తడబడిన కమిన్స్ సేన
- ఇవాళ సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో ఢీ
గత రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతోంది. వరుసగా ఓడిన ఆ రెండు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ రెండోసారి బ్యాటింగ్ చేసింది. ఛేదనలో తడబడడంతో ఆ జట్టుకి ఓటమి తప్పలేదు.
ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ సారథి పాట్ కమిన్స్ నేడు టాస్ గెలవగానే, మరేమీ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో తాము గెలిచిన మ్యాచ్ లన్నీ మొదట బ్యాటింగ్ చేసినవేనని కమిన్స్ వెల్లడించాడు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో కొత్త పిచ్ ను సిద్ధం చేశారు. పిచ్ హార్డ్ గా ఉందని, బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంటుందని ఎనలిస్టులు చెప్పారు.
కాగా, ఆల్ రౌండర్ మార్కో యన్సెన్ కు సన్ రైజర్స్ జట్టులో స్థానం కల్పించారు. అటు, రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో చేర్చారు.
ఐపీఎల్ తాజా సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 8 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.