Pawan Kalyan: నేను సినిమాల్లో వేలు చూపించే ఫొటోలకు పోజులివ్వడానికే ఆలోచిస్తాను.... ఈయన వేలు చూపించి సిద్ధం అంటున్నాడు: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on CM  Jagan in Visakha South

  • విశాఖ సౌత్ నియోజకవర్గంలో వారాహి విజయభేరి సభ
  • ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడే ప్రజల వేదన అర్థమైందన్న పవన్
  • చెల్లెలి జీవితాన్ని బయటికి లాగిన వ్యక్తి ఉన్నాడంటూ వ్యాఖ్యలు
  • మరోసారి వైసీపీ అరాచకాన్ని భరించే ఓపిక రాష్ట్రానికి లేదని వెల్లడి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ సౌత్ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఉత్తరాంధ్రపై తన అభిమానాన్ని చాటుకున్నారు. నటనలో తాను ఓనమాలు నేర్చుకుంది ఈ గడ్డపైనే అని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అంటే ఆట, పాట, పొలం, పని, సముద్రం, సైనికుడు అని వివరించారు. ఇవి ఉత్తరాంధ్ర ఆరు ప్రాణాలు అని పేర్కొన్నారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, సిక్కోలు-ఆరు ప్రాణాలు అని ఒక రచయిత రాశాడని వెల్లడించారు. 

"విశాఖలో నటనలో శిక్షణ పొందే సమయంలో ఇక్కడే చాలా నెలలు ఉన్నాను. భీమిలి వెళ్లేవాడ్ని. అక్కడే సముద్రం పక్కన కూర్చుని యాక్టింగ్ క్లాసులకు హాజరయ్యేవాడ్ని. ఇక్కడే ఉత్తరాంధ్ర ఆటాపాటా నేర్చుకున్నాను. ఆ రోజుల్లోనే జనం తాలూకు వేదన అర్థమైంది. 

కానీ ఈ రోజు 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే పట్టించుకోకుండా, సొంత చెల్లి జీవితాన్నే బయటికి లాగిన దిగజారుడు వ్యక్తి ఉన్నాడు... సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు ఇక్కడున్న ఆడబిడ్డలకు గౌరవం ఇస్తాడా? భార్యాపిల్లలను కిడ్నాప్ చేస్తే వాళ్ల సొంత ఎంపీనే రక్షించుకోలేకపోయాడు. సొంత కుటుంబాలనే రక్షించుకోలేనివాళ్లు మన జీవితాలకు ఏం భద్రత ఇస్తారు? 

రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు... ప్రజలు నమ్మకంతో ఓటేస్తారు. కానీ నాకు నేనే పరీక్ష పెట్టుకున్నాను. 2014లో పార్టీ పెట్టినప్పుడు నాకు పోటీ చేసే అర్హత లేదనుకున్నాను. ఆకలితో కడుపుమాడే పేదవాడి హృదయ వేదన అర్థం చేసుకోవడమే రాజకీయాలకు అర్హత అని భావించాను. 

ఈ ముఖ్యమంత్రి వేలు చూపించి సిద్ధం సిద్ధం అంటున్నాడు... దేనికయ్యా సిద్ధం నువ్వు? మేం కూడా సిద్ధం. ఓటేసి కింద తుంగలో తొక్కడానికి మేము సిద్ధం. నువ్వు వేలు చూపించి ఎవడ్ని బెదిరిస్తున్నావు? నేను సినిమాల్లో వేలు చూపించే ఫొటోలకు పోజులివ్వడానికే ఆలోచిస్తాను... అలాంటిది ఈయన సిద్ధం అంటే మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు. నేను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ ఫ్యాక్షన్ మూకలను ఎదుర్కొంటున్నాను" అంటూ పవన్ పేర్కొన్నారు. 

నాడు తనను హోటల్ లో నిర్బంధించినప్పుడు... యావత్ విశాఖ మొత్తం తరలివచ్చి నోవోటెల్ వద్ద నిలిచిందని వెల్లడించారు. ఒక మహిళ తన నాలుగేళ్ల బిడ్డను చంకనెత్తుకుని వచ్చిందని, దోమలు కుడుతున్నా ఆమె నిలబడి, నా అన్న కోసం వచ్చాను అన్నప్పుడు నా గుండె కదిలిపోయిందని తెలిపారు. ఆమె కేవలం నాకోసమే వచ్చినట్టు కాదు... ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చినట్టు అని స్పష్టం చేశారు. 

ఇంకోసారి వైసీపీ అరాచకాన్ని భరించే ఓపిక ఏపీకి లేదని... ఈ ఎన్నికలతో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని పవన్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News