SRH: నితీశ్ వీరబాదుడు, క్లాసెన్ మాస్ కొట్టుడు... సన్ రైజర్స్ భారీ స్కోరు
- సన్ రైజర్స్ × రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు
- అర్థ సెంచరీతో రాణించిన హెడ్
- 42 బంతుల్లోనే 76 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి
- 19 బంతుల్లో 42 పరుగులు చేసిన క్లాసెన్
సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ తో పోరులో నితీశ్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ రాణించడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు నమోదు చేసింది.
ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేశాడు. అయితే తనదైన శైలిలో వేగంగా ఆడడంలో హెడ్ విఫలమయ్యాడు. హెడ్ ఆటతీరును బాగా పరిశీలించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు... ఏమాత్రం అర్థం కాని రీతిలో బంతులు వేయడం, కీలక స్థానాల్లో ఫీల్డర్లను మోహరించడం ద్వారా అతడి దూకుడుకు అడ్డుకట్ట వేసింది.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 12 పరుగులకే వెనుదిరగ్గా, మార్ క్రమ్ స్థానంలో వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ 5 పరుగులకే అవుటయ్యాడు. ఈ దశలో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ జోడీ స్కోరుబోర్డును ఉరకలెత్తించింది.
నితీశ్ రెడ్డి 42 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న నితీశ్ 3 ఫోర్లు, 8 సిక్సులు బాదడం విశేషం. క్లాసెన్ కూడా వేగంగా ఆడడంతో సన్ రైజర్స్ స్కోరు 200 దాటింది. క్లాసెన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేష్ ఖాన్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.