Rohit Sharma: జీవితంలో అన్నీ మనం కోరుకున్నట్టు జరగవు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై రోహిత్ శర్మ
- అదంతా జీవితంలో ఓ భాగమని రోహిత్ వ్యాఖ్య
- తాను గతంలోనూ అనేక మంది కెప్టెన్ల నేతృత్వంలో ఆడానని వ్యాఖ్య
- అదే రీతిలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నానని వెల్లడి
- పరిస్థితిని బట్టి నడుచుకోవాలని అభిప్రాయం
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడంపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవని వ్యాఖ్యానించారు. అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీం కెప్టెన్సీని కోల్పోవడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఇక అభిమానులైతే నిరాశలో కూరుకుపోయారు. రోహిత్ స్థానంలో ఎమ్ఐ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్‌కు దిగారు.
‘‘ఇదంతా జీవితంలో ఓ భాగం. మనం అనుకున్నవన్నీ జరగవు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ నాకో మంచి అనుభవం. నేను గతంలో కూడా ఇతర కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. పాండ్యా నేతృత్వంలో ఆడటం కూడా ఇలాగే ఆడాను’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ తదితరుల నేతృత్వంలో రోహిత్ ఆడాడు.
‘‘పరిస్థితి ఎలా ఉంటే అలా నడుచుకోవాలి. టీం కోసం చేయగలిగినంత చేయాలి. గత నెల రోజులుగా నేను అదే చేస్తున్నాను’’ అని రోహిత్ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ రోహిత్ 10 ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేశాడు.