Rashid Latif: టీ20 ప్రపంచకప్‌లో మేం ఓడిపోతే.. పాక్ క్రికెట్ బోర్డుపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
- వన్డే, టెస్టు జట్లకు గ్యారీ కిరెస్టన్, జాసన్ గిల్లెప్సీని హెడ్‌కోచ్‌లుగా నియమించిన పాక్ బోర్డు
- టీ20 ప్రపంచకప్‌కు కొన్ని రోజుల ముందు వారి నియామకంపై విమర్శలు
- పాక్ జట్టు ఓడిపోతే దానికి కిరెస్టన్‌ను కానీ, కెప్టెన్ బాబర్‌ను కానీ బోర్డు బాధ్యులుగా చేస్తుందన్న రషీద్ లతీఫ్
- అది తమ సంప్రదాయమని ఎద్దేవా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కనుక ఓటమి పాలైతే ఆ నిందను కోచ్ గ్యారీ కిరెస్టన్ ఎదుర్కోవాల్సి వస్తుందని, ఓటమి నెపాన్ని బోర్డు ఆయనపై తోసేస్తుందని పేర్కొన్నాడు.
పాక్ బోర్డు వారం క్రితమే వన్డే, టెస్టు జట్లకు గ్యారీ కిరెస్టన్, జాసన్ గిల్లెప్సీని రెండేళ్ల కాలానికి గాను హెడ్‌కోచ్‌లుగా నియమించింది. టీ20 ప్రపంచకప్‌కు కొన్ని రోజుల ముందు వారిని కోచ్‌లుగా నియమించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.
గ్యారీ కిరెస్టన్ భారత జట్టు కోచ్‌గా, ఫ్రాంచైజీ క్రికెట్ కోచ్‌గా అద్భుత విజయాలు అందుకున్నాడని, కాకపోతే ఇప్పుడు వారిని నియమించిన సమయం సరికాదని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలోనే ప్రపంచకప్ ఆడబోతున్నామని, పాకిస్థాన్ మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడబోతున్నట్టు చెప్పాడు.
చాలా తక్కవ సమయం మాత్రమే ఉందని, పాకిస్థాన్ కనుక ఓటమి పాలైతే బోర్డు కిరెస్టన్‌ను కానీ, కెప్టెన్ బాబర్ ఆజంను కానీ బాధ్యులను చేస్తుందని, ఇది తమ సంప్రదాయమని ఎద్దేవా చేశాడు. అయితే, తాను మాత్రం బాబర్‌ను కానీ, కిరెస్ట్‌ను కానీ తప్పుబట్టబోనని చెప్పుకొచ్చాడు.