Rapolu Ananda Bhaskar: బీఆర్ఎస్కు మరో షాక్... కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపిన మాజీ ఎంపీ
- విధిలేని పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడి
- ఏ పార్టీలోకి వెళతానో ఇప్పుడే చెప్పలేనని... ప్రజాఉద్యమాల్లో ఉంటానని వెల్లడి
- పార్టీలోకి ఆహ్వానించినప్పుడు కప్పిన గులాబీ కండువాను పంపిస్తున్నట్లు వెల్లడి
- హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆనంద భాస్కర్ మాట్లాడుతూ... విధిలేని పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తాను ఏ పార్టీలోకి వెళతానో ఇప్పుడే చెప్పలేనన్నారు. ప్రజా ఉద్యమాల్లో మాత్రం ఉంటానన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వెలుపల ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీకి తన అవసరం లేదని, అందుకే కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నానని... అలాగని దూషిస్తూ వెళ్లిపోవడం తన నైజం కాదన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వినమ్రంగా పంపిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. వాటిని నిలువరించే ఉద్యమాల్లో కీలక పాత్రను పోషిస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సహా అందరి దృష్టికి తీసుకువెళతానన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తోందని... కుల జనగణన దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు.