Chandrababu: మీ భూమి మీది కాదు... ఈ నల్ల చట్టంతో జాగ్రత్త: దర్శిలో చంద్రబాబు
- ప్రకాశం జిల్లా దర్శిలో చంద్రబాబు ప్రజాగళం సభ
- ప్రజలను చూసి ఎండ కూడా భయపడిపోతోందన్న టీడీపీ అధినేత
- కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఖాయమని వెల్లడి
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూమి సైకో గుప్పిట్లో ఉంది అంటూ వ్యాఖ్యలు
ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. 46, 47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలివచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతోందని అన్నారు. దర్శి యువతలో ఉత్సాహం పొంగిపొర్లుతోందని పేర్కొన్నారు. ఒకప్పుడు నాయకులు తక్కువగా ఉన్నా, టీడీపీకి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచింది కార్యకర్తలేనని స్పష్టం చేశారు.
ఇవాళ దర్శిలో ఎక్కడ చూసినా పసుపు మయం అయిపోయిందని, దీనికి అదనంగా జనసైనికులు అని వివరించారు. జనసైనికులు ఉత్సాహం చూస్తుంటే కడుపు నిండిపోతోందని చంద్రబాబు తెలిపారు. అంతేగాకుండా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.... మూడు పార్టీలు కలిసిన తర్వాత ఇంకెవరైనా ఇక్కడ మనుగడ సాగిస్తారా... అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం అని అన్నారు.
మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మాగుంట ఒంగోలులో ఒక బ్రాండ్ అని తెలిపారు. అలాంటి వ్యక్తిని కాదని సైకో ఒక ఎర్రచందనం స్మగ్లర్ ను తీసుకువచ్చాడని విమర్శించారు. మీకు స్మగ్లర్ కావాలా, బ్రాండ్ కావాలా తేల్చుకోవాలని సూచించారు.
ఇక దర్శి నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఆమెకు పుట్టుకతోనే రాజకీయ లక్షణాలు వచ్చాయని, వాళ్ల తండ్రి ఎమ్మెల్యే (గొట్టిపాటి నర్సయ్య) అని వివరించారు. లక్ష్మి ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక మహిళ కాన్పుకు వస్తే, అక్కడ డాక్టర్ లేకపోవడంతో ప్రచారం ఆపేసి, కాన్పు చేసి తల్లీబిడ్డను కాపాడిందని తెలిపారు. లక్ష్మి ఒక సమర్థమైన డాక్టరే కాదు... ఒక సమర్థమంతమైన ప్రజానాయకురాలు అని కొనియాడారు. ఆమె ప్రజలను తప్పకుండా ఆదుకుంటుందని అన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో నిజమైన హీరో అని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, ఈ సైకోను ఇంటికి పంపించాలనేది ఆయన అభిమతం అని స్పష్టం చేశారు. మరోపక్క నరేంద్ర మోదీ గారు... 2047 నాటికి భారత్ ను నెంబర్ వన్ గా చేయాలనేది ఆయన సంకల్పం... అందులో నా సంకల్పం, పవన్ సంకల్పం... తెలుగుజాతిని నెంబర్ వన్ గా చేయాలి అని పేర్కొన్నారు.
"ఐదేళ్ల పాటు పరదాలు కట్టుకుని తిరిగిన జగన్ ఇప్పుడు మళ్లీ వచ్చాడు. తలపై చేయి పెట్టి, బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చి బాదుడే బాదుడుకు తెరదీశాడు. ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చి ఏం చేశాడో చెప్పుకోలేక ఇబ్బందిపడుతున్నాడు.
నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంట. ఒకటే గుర్తు పెట్టుకో సైకో... నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో 19.15 శాతం కేటాయిస్తే... నువ్వు కేటాయించింది 15.8 శాతం మాత్రమే. నువ్వు చేయని పనులకు డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప... నువ్వు చేసిందేమీ లేదు.
జలగ జగనన్న ప్రజల రక్తాన్ని తాగే రకం. నేను ప్రజలకు రక్తం ఎక్కించే రకం. నవరత్నాలు అంటున్నాడు. కానీ ఆ నవరత్నాలు రాలిపోయాయి. ఇప్పుడు కొత్త చట్టం తీసుకువచ్చాడు. పట్టాదారు పాస్ బుక్ లేదు, టెన్ వన్ లేదు, అడంగల్ లేదు... అన్నీ రద్దు చేసి మీ భూములను ఆయన పేరుతో ఆన్ లైన్ లో పెట్టుకుంటాడట. కాలిఫోర్నియాలో ఉండే క్రిటికల్ రివర్ అనే కంపెనీకి ఈ వ్యవహారం అంతా అప్పగించాడు. ఇది జగన్ బినామీ కంపెనీ.
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2023 ప్రకారం ఈ యముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. మీ భూమి మీది కాదు ఇప్పుడు. మీ భూమి సైకో గుప్పెట్లో ఉంది. ఆయనొక ప్రైవేటు కంపెనీ పెట్టుకున్నాడు. భూ రికార్డులన్నీ ఆ కంపెనీల్లో భద్రపరుస్తున్నాడు. ఆ రికార్డులు మార్చేస్తే మీ భూమి గోవిందా గోవింద!
ఒకప్పుడు ప్రజలు తమ భూమిని అమ్ముకోవాలనుకుంటే స్వేచ్ఛగా అమ్ముకునేవాళ్లు. ఇప్పుడా హక్కును హరించారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు ప్రజలు వెళ్లాలి... అక్కడ అనుమతి ఇస్తేనే మీ భూమిని అమ్ముకోవడానికి వీలుంటుంది. వాళ్లు అనుమతి ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు. భూమి మీది... పెత్తనం జలగది!
మీ మెడలకు ఉరితాళ్లు వేసేశాడు. ఈ చట్టం కూడా అమల్లోకి వచ్చేసింది. ఇది నల్ల చట్టం. ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మేం అధికారంలోకి రాగానే దీన్ని చించి చెత్తబుట్టలో పారేస్తాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.