Station Master Asleep: కునుకు తీసిన స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ లేక ముందుకు కదలని ఎక్స్‌ప్రెస్ రైలు!

station masters slips into sleep delaying patna kota train for half an hour
  • మే 3న ఉత్తరప్రదేశ్‌లోని ఉడిమోర్ జంక్షన్ వద్ద ఘటన
  • పాట్నా-కోటా రైలు వచ్చే సమయానికి నిద్రలోకి జారిన స్టేషన్ మాస్టర్
  • సిగ్నల్ మారకపోవడంతో జంక్షన్ వద్దే అరగంటపాటు నిలిచిపోయిన రైలు
  • స్టేషన్‌ మాస్టర్ తీరుపై ఉన్నతాధికారుల సీరియస్, చర్యలు తీసుకుంటామని ప్రకటన
విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ కునుకు తీయడంతో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ముందుకు కదలలేదు. సిగ్నల్ లేని కారణంగా ఏకంగా అరగంట పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే, పాట్నా - కోటా ఎక్స్‌ప్రెస్ రైలు మే 3న ఉడిమోర్ జంక్షన్‌కు చేరుకుంది. అక్కడున్న స్టేషన్ మాస్టర్ అప్పటికే కునుకులోకి జారుకోవడంతో సిగ్నల్ మార్చలేదు. స్టేషన్ మాస్టర్‌ను మేల్కొలిపేందుకు లోకోపైలట్ అనేక సార్లు హారన్ కొట్టినట్టు తెలిసింది. మరోవైపు, రైలు ఎంతకీ కదలకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 

కాగా, స్టేషన్ మాస్టర్ విధుల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని తీవ్రంగా పరిగణించిన డివిజన్ రైల్వే అధికారులు ఆయన నుంచి వివరణ కోరారు. అనంతరం, తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ ఓ వార్తాసంస్థకు తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనతో పాటు డ్యూటీలో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ తనిఖీలకు వెళ్లడంతో తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నానని స్టేషన్ మాస్టర్ తెలిపాడని చెప్పారు.
Station Master Asleep
Patna Kota Train Delayed
Indian Railways
Agra Division

More Telugu News