Subrahmanyam Jaishankar: నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టుపై మంత్రి జైశంకర్ స్పందన

S Jaishankar Reacts To Canada Arresting 3 Indians In Hardeep Nijjar Murder
  • గతేడాది కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య
  • ఈ కేసులో శుక్రవారం ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు 
  • నిందితులకు భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ
  • ఈ అరెస్టులకు సంబంధించి అదనపు సమాచారం కోసం వేచి చూస్తున్నామన్న మంత్రి జైశంకర్
సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేయడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. వారికి సంబంధించి కెనడా పోలీసులు ఇచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. ‘‘ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కెనడా పోలీసుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’’ అని ఆయన అన్నారు. 

ఈ పరిణామంపై కెనడాలోని భారత హైకమిషనర్ కూడా స్పందించారు. ‘‘కెనడా పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే, ఇది ఆ దేశ అంతర్గత విషయం. దీనిపై వ్యాఖ్యానించేందుకు ఏమీ లేదు’’ అని అన్నారు. 

కెనడా పౌరుడు, సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు శుక్రవారం ముగ్గురు భారతీయులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల పాటు వారిపై నిఘా పెట్టిన అనంతరం శుక్రవారం ఎడ్మంటన్ నగరంలో ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ భారతీయులేనని తేలింది. అయితే, నిందితులకు భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ను గతేడాది సర్రీలో ఓ గురుద్వారా ముందు కొందరు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని అప్పట్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం సంచలనంగా మారింది.
Subrahmanyam Jaishankar
Hardeep Singh Nijjar
Three Indians Arrested
Canada

More Telugu News