supreme court of india: స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్
- చిన్నప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- టీచర్ కొట్టడంతో 10 రోజులపాటు అరచేయి నొప్పి తగ్గలేదని వెల్లడి
- భౌతికంగా గాయం మానినా మనసులో మాత్రం చెరగని ముద్ర మిగిలిపోయిందని వ్యాఖ్య
ఈ కాలంలో పిల్లలను క్రమశిక్షణలో పెట్టేందుకు దండించడాన్ని క్రూరమైన పద్ధతిగా భావిస్తున్నా కొన్ని దశాబ్దాల కిందట మాత్రం అదే జరిగేది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు సైతం చిన్నప్పుడు ఈ దెబ్బల అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఓ సెమినార్ లో ఆయన మాట్లాడుతూ ఓ చిన్నతప్పు చేసినందుకు బెత్తం దెబ్బలు తిన్నట్లు చెప్పుకొచ్చారు. ‘పిల్లలను ఎలా చూస్తారనేది వారి మనసులో జీవితాంతం ముద్ర వేస్తుంది. స్కూల్లో ఆ రోజు జరిగిన ఘటనను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ రోజుల్లో నేనేమీ తప్పులు చేసి దెబ్బలు తినే రకం పిల్లాడిని కాను. క్రాఫ్ట్ క్లాస్ లో అసైన్ మెంట్ పూర్తి చేసేందుకు సరైన సైజ్ సూది తీసుకురాలేదు. దీంతో టీచర్ చేతిలో బెత్తం దెబ్బలు తిన్నా. అప్పటికీ టీచర్ ను బతిమిలాడా.. దయచేసి చేతుల మీద కొట్టొద్దని.. కావాలంటే పిర్ర మీద కొట్టాలని అడిగా. కానీ టీచర్ కుడి అరచేయిపై కర్రతో బాదారు. 10 రోజుల దాకా నొప్పి తగ్గని చెయ్యిని తల్లిదండ్రులు సహా ఎవరికీ చూపించకుండా దాచుకొనేవాడిని’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ నాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
అనంతరం దీని గురించి వివరిస్తూ ‘భౌతికంగా నాకు అయిన గాయం మానింది. కానీ అది జీవితాంతం నా మనసులో చెరగని ముద్ర వేసింది. నేను పని చేసేటప్పుడు కూడా అదింకా నాతో ఉంది. పిల్లలకు జరిగే అలాంటి అవమానం వారిపై ఎంతో ప్రభావం చూపుతుంది’ అని సీజేఐ చెప్పారు.
బాల నేరస్తులు–న్యాయం అనే అంశంపై నేపాల్ సుప్రీంకోర్టు నిర్వహించిన జాతీయ సదస్సులో జస్టిస్ డీవై చంద్రచూడ్ పాల్గొన్నారు. చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న పిల్లల ప్రత్యేక అవసరాలను, దుర్బల పరిస్థితులను న్యాయస్థానాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాల నేరస్తులు సమాజంలో తిరిగి స్థానం సంపాదించుకొనేలా వారికి అవకాశాలు కల్పించాలని సూచించారు. వారి విషయంలో జాలి, కరుణతో స్పందించాలని కోరారు.