Encounter: రెండు నెలల్లో 90 మంది ఎన్ కౌంటర్.. పౌర హక్కుల సంఘం
- సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
- అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన నక్సలైట్ మృతదేహం స్వగ్రామానికి..
- కాశవేన రవి మృతదేహానికి నివాళులు అర్పించిన పౌర హక్కుల సంఘం నేతలు
చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అబూజ్ మడ్ లో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లతో గడిచిన రెండు నెలల్లోనే 90 మందిని కాల్చి చంపారని హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి ఆరోపించారు. నక్సల్స్ స్థావరాలను గుర్తించి డ్రోన్ల ద్వారా విష రసాయనాలను చల్లుతున్నారని మండిపడ్డారు. ఆపై నక్సల్స్ స్పృహ తప్పగానే కాల్పులు జరిపి వారిని మట్టుబెడుతున్నారని మండిపడ్డారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని అడవుల్లోకి తీసుకొచ్చి, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారిని ఏరివేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ లో అమరుడైన కాశవేన రవి అలియాస్ వినయ్ మృతదేహం శనివారం హనుమకొండ జిల్లాలోని ఆయన స్వగ్రామం వంగరకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరుల బంధుమిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం, దళిత లిబరేషన్ ఫ్రంట్, విరాసం తో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు వంగర గ్రామానికి వెళ్లి రవి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 33 ఏళ్ల క్రితం రవి మావోయిస్టు ఉద్యమంలో చేరాడని, అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్య డివిజన్ కమిటీ సభ్యుడి దాకా ఎదిగారని హక్కుల సంఘం నేతలు చెప్పారు. ఆదివాసుల హక్కుల కోసం, పెట్టుబడిదారీ వ్యవస్థపై నిత్యం పోరాడారని గుర్తుచేసుకున్నారు.